‘కృష్ణా’ జలాలు మళ్లీ పంచాలి | KCR Request Letter To Nitin Gadkari Over Krishna Water Allocation | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ జలాలు మళ్లీ పంచాలి

Published Tue, Aug 28 2018 1:17 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

KCR Request Letter To Nitin Gadkari Over Krishna Water Allocation - Sakshi

సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం కేసీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా జలాలను నదీ పరీవాహక రాష్ట్రాల మధ్య తిరిగి పంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై గతంలో తాము చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించాలని, ఈ అంశాన్ని కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ ముందుం చాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం కేంద్ర జలవనరులు, రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఎనిమిది అంశాలపై గడ్కరీకి సీఎం వినతిపత్రాలు అందజేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పాల్గొన్నారు. ట్రిబ్యునల్‌కు రెఫర్‌ చేసే అంశంపై మినహా మిగిలిన అన్ని అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌తో తెలంగాణకు 

న్యాయం జరగదు...
కృష్ణా నదీ పరీవాహకప్రాంత రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఉండేవని, విభ జన చట్టం ద్వారా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ టంతో నదీ జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి చేపట్టాలని గడ్కరీని కేసీఆర్‌ కోరారు. ఇందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట నదీ జలాల వివాద చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ–1956)లోనిసెక్షన్‌–3 కింద తాము 2014 జూలై 7న కేంద్ర జలవనరులశాఖకు ఫిర్యాదు చేసిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ ఫిర్యాదుపై విచారణకు కేంద్ర జలవనరులశాఖ కొత్త ట్రిబ్యు నల్‌ను ఏర్పాటు చేయడమో లేదా ఉనికిలో ఉన్న ట్రిబ్యునల్‌ను విచారించాల్సిందిగా ఆదేశించడమో చేయాల్సి ఉన్నా వాటిని పట్టించు కోలేద న్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీ కరణ చట్టంలోని సెక్షన్‌ 89 అమలు అంశాల కోసం మాత్రమే బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ గడువును జల వనరులశాఖ పొడిగించిందని వివరించారు. సెక్షన్‌ 89 పరిధి చాలా పరిమితమని, ఇది తెలంగాణ హక్కులను కాపాడ టంలో ఎంత మాత్రం న్యాయం చేయదని నివేదిం చారు. అందువల్ల తెలంగాణ ఫిర్యా దును పునఃపరి శీలించి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్‌ 5(1) కింద కేడబ్ల్యూ డీటీ–2కు రెఫర్‌ చేయాలని కోరారు. అప్పుడే తెలంగాణకు న్యాయం జరుగుతుందని గడ్కరీకి వివరించారు.

సీతారామసాగర్‌ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టే...
‘గోదావరిపై నిర్మిస్తున్న సీతారామ సాగర్‌ ప్రాజెక్టును కొత్త ప్రాజెక్టుగా కాకుండా నిర్మాణంలో ఉన్న ప్రాజె క్టుగా గుర్తించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2005 డిసెంబర్‌లో అప్పటి ప్రభుత్వం పాములపల్లి వద్ద రూ. 1,681 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్‌ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం–1 మంజూరు చేసింది. అలాగే రుద్రంకోట వద్ద రూ. 1,824 కోట్ల అంచనాతో ఇందిరాసాగర్‌ రుద్రంకోట ఎత్తిపోతల పథకం మంజూరు చేసింది. ఆ ప్రకారంగా టెండర్ల ప్రక్రియ పూరై్త 2007లో ఈ ప్రాజెక్టులపై పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర విభజన నాటికి రాజీవ్‌ దుమ్ముగూడెం ప్రాజెక్టుపై రూ. 871.8 కోట్లు, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుపై రూ. 899.36 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఇందిరాసాగర్‌ హెడ్‌వర్క్స్‌ ఆంధ్ర ప్రదేశ్‌ పరిధిలోకి వెళ్లడం, అలైన్‌మెంట్‌ అభయార ణ్యం మీదుగా వెళ్లడంతో రీ ఇంజనీరింగ్‌ చేయాల్సి వచ్చింది.

అంతర్రాష్ట్ర వివాదాన్ని తప్పించేందుకు వీలుగా హెడ్‌వర్క్స్‌ను తెలంగాణ పరిధిలోకి మార్చాల్సి వచ్చింది. అలాగే అభయారణ్యం నుంచి అలైన్‌ మెంట్‌ను తప్పించాం. ప్రాజెక్టు మరింత అను కూలంగా ఉండేందుకు వీలుగా ఈ రెండు ప్రాజెక్టు లను కలిపి సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చాం. ఈ ప్రతిపాదనను కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) పంపితే వారు దీన్ని గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ)కు పంపినట్టు మాకు సమాచారం ఉంది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జీఆర్‌ఎంబీ, అపెక్స్‌ కౌన్సిల్‌ పాత్ర కేవలం కొత్త ప్రాజెక్టులకే పరిమితం. సీతారామ సాగర్‌ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు అయినందున దీన్ని కొత్త ప్రాజెక్టుగా పరిగణించరాదు. ఈ దిశగా సీడబ్ల్యూసీని ఆదేశించాలి’అని సీఎం కేసీఆర్‌ గడ్కరీని కోరారు.

ఆర్‌ఆర్‌ఆర్‌కు సహకారం అందించండి...
‘154 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–నర్సాపూర్‌– తూప్రాన్‌–గజ్వేల్‌–జగ్‌దేవ్‌పూర్‌–భువనగిరి–చౌటుప్పల్‌ రాష్ట్ర రహదారితోపాటు 180 కి.మీ. పొడవున్న చౌటుప్పల్‌–యాచారం–షాద్‌నగర్‌–చేవెళ్ల–శంకర్‌పల్లి–కంది రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా విస్త రించేందుకు అంగీకరించినందుకు ధన్య వాదాలు. ఈ రెండు రహదారులు హైదరాబాద్‌ చుట్టూ 50 కి.మీ. దూరంలో ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ ఆర్‌)గా రూపాంతరం చెందుతాయి. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో ఈ రోడ్లు కీలకం కానున్నాయి. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ రోడ్డును జాతీయ రహదారి 161 ఏఏగా ప్రకటించి దీని అభివృద్ధిని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారు. అయితే రెండో రోడ్డు అయిన చౌటుప్పల్‌ నుంచి కంది వరకు రోడ్డు మార్గాన్ని కేంద్ర రహదారులశాఖ ఆమోదించినా ఇంకా జాతీయ రహదారిగా గుర్తించి గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు. తెలంగా ణలో ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పశ్చిమానికి ప్రస్తుతం జాతీయ రహదారులపై వచ్చే ట్రాఫిక్‌ హైదరాబాద్‌ను దాటేందుకు రాష్ట్రం అభివృద్ధి చేసిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను వినియోగిస్తోంది. భారీగా నెలకొన్న ఐటీ రంగం కారణంగా దేశంలోనే అత్యంత వేగంగా హైదరాబాద్‌ అభివృద్ధి చెందుతోంది.

ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌పై ఐదేళ్లలో తీవ్ర రద్దీ ఏర్పడుతుంది. అందువల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా జాతీయ రహదారుల నెట్‌ వర్క్‌ విస్తరణకు వీలుగా పైరెండు రోడ్లను ఆరు లేన్ల రహదారులుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు అవసరాలకుగాను 8 లేన్ల రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణనూ చేపట్టడం అవసరం. రాష్ట్ర ప్రజాపనుల విభాగం ఈ దిశగా 150 మీటర్ల (500 ఫీట్ల) వెడల్పుతో రైట్‌ ఆఫ్‌ వే (ఆర్వోడబ్ల్యూ) ఉండేలా ఫీజిబిలిటీ నివేదకలను ప్రతిపాదించింది. ఇందుకు 4,900 హెక్టార్ల భూసేకరణ అవసరం అవుతోంది. ఈ ప్రాజెక్టులకు మొత్తంగా రూ. 11 వేల కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్‌ పర్యటనలో మీరు మే 5న ఈ రెండు రహదారులను నాలుగు లేన్ల రహదారిగా మార్చేందుకు వీలుగా మంజూరు చేస్తున్నట్లు లాంఛనప్రాయంగా చెప్పారు. అందువల్ల రెండో రహదారిని కూడా జాతీయ రహదారిగా గుర్తిస్తూ నోటిఫికేషన్‌ జారీచేయడంతో పాటు ఈ రెండు రోడ్డు ప్రాజెక్టులను ఆరు లేన్ల ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలి’అని సీఎం నివేదించారు

మరమ్మతులకు నిధులు అవసరం...
జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ మధ్య ఎన్‌హెచ్‌–167పై 15 కి.మీ. మేర రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని చాలా కాలంగా కోరుతున్నామని, దీన్ని త్వరితగతిన మంజూరు చేసి పనులు ప్రారంభించాలని గడ్కరీకి సీఎం కేసీఆర్‌ మరో వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్రంలో 2 వేల కి.మీ. మేర జాతీయ రహదారులను నాలుగు లేన్ల రహదారులుగా మార్చే పనిని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారని, ఇందులో వెయ్యి కి.మీ. అభివృద్ధి చేశారని, మరో 400 కి.మీ. పొడవున పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అయితే మిగిలిన 600 కి.మీ. పనులు టెండర్‌ దశలోనే ఉన్నాయని, ఈ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నందున మరమ్మతుల కోసం నిధులు ఇవ్వాలని కోరారు.

హైవేల నిర్వహణకు పీడబ్ల్యూడీకి నిధులివ్వండి..
రాష్ట్రంలో 5,600 కి.మీ. మేర జాతీయ రహదారులు ఉండగా వాటిలో 2 వేల కి.మీ. మేర ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహణ, అభివృద్ధి పనులు చూస్తోందని, మిగిలిన 3,600 కి.మీ. రహదారులను రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం చూస్తోందని ముఖ్యమంత్రి వివరించారు. అయితే దీనికి కేంద్రం గత రెండేళ్లలో వరుసగా రూ. 2,635 కోట్లు, రూ. 3,030 కోట్లు విడుదల చేయగా ఈ ఏడాదికి కేవలం రూ. 353 కోట్లే ఇచ్చిందన్నారు. అందువల్ల కనీసం రూ. 3 వేల కోట్లు ఇవ్వాలని గడ్కరీని కోరారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధిని  ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ పొందుపరిచినందున ఇందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.

ఆ ఏడు రోడ్లను జాతీయ హైవేలుగా గుర్తించండి..
తెలంగాణలో పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఆమోదం తెలపడంలో, గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోందని సీఎం కేసీఆర్‌ గడ్కరీకి వరించారు. సూత్రప్రాయ అంగీకారం తెలిపిన ఏడు ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. చౌటుప్పల్‌–కంది రహదారికి అలైన్‌మెంట్‌ ఆమోదం, గెజిట్‌ నోటిఫికేషన్‌ రావాల్సి ఉందని, మెదక్‌–సిద్దిపేట–ఎల్క తుర్తికి నోటిఫికేషన్‌ రావాల్సి ఉందని వివరించారు. అలాగే కరీంనగర్‌–సిరిసిల్ల–పిట్లం రహదారికి అలైన్‌మెంట్‌ ఆమోదం, నోటిఫికేషన్‌ రావాలని వివరించారు. గౌరెల్లి–వలిగొండ–కొత్తగూడెం రోడ్డుకు, మెదక్‌–ఎల్లారెడ్డి– రుద్రూరు రోడ్డుకు, బోధన్‌–బాసర–భైంసా రహదారికి నోటిఫికేషన్‌ రావాల్సి ఉందని నివేదించారు. దుద్దెడ–సిద్దిపేట–సిరిసిల్ల రహదారికి అలైన్‌మెంట్‌ అనుమతి రావాల్సి ఉందన్నారు. 

ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన హైదరాబాద్‌ చేరుకున్న ముఖ్యమంత్రి  
సాక్షి, న్యూఢిల్లీ : సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్య టన ముగిసింది. సోమవారం రాత్రి ప్రత్యేక విమా నంలో ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. రాజ కీయ, పాలనాపరమైన అంశాలపై కేంద్రంతో చర్చల కోసం శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం  శనివారం ప్రధాని మోదీని, ఆదివారం హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కలిశారు. సోమవారం మధ్యాహ్నం నితిన్‌ గడ్కరీతో భేటీ అనంతరం ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement