
ఇంటింటికీ నీరు.. ఇంటర్నెట్
‘భగీరథ’ పనుల సమీక్షలో సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా జలాలు ఈ ఏడాది చివరి నాటికి గ్రామాలకు చేరుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పైపు లైన్లతోపాటు ఫైబర్ కేబుల్ పనులూ పూర్తి చేయాలని.. ఇంటింటికి మంచినీళ్లతో పాటు ఇంటర్నెట్ సౌకర్యమూ కల్పించి రాష్ట్రాన్ని అమెరికా సరసన నిలబెట్టాలన్నారు. మిషన్ భగీరథ పనులపై ప్రగతి భవన్‌లో సోమవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇక నుంచి ప్రతిరోజూ భగీరథ పనులను పర్యవేక్షించాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. భగీరథ పనుల్లో వేగం పెరగాలని.. వర్కింగ్ ఏజన్సీలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఇంజనీర్లు సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలన్నారు.
పనుల్లో జాప్యం చేసే వర్కింగ్ ఏజన్సీలు పద్ధతి మార్చుకోవాలని, ఒప్పందం ప్రకారం వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలం వచ్చే లోగా పంట పొలాల్లో జరగాల్సిన పనులన్నీ పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తయిన ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఒక్కొక్కటిగా వాడుకలోకి తేవాలని సూచించారు. భగీరథ ప్రాజెక్టుకు అవసరమయ్యే విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం కోరారు. భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సలహాదారు జ్ఞానేశ్వర్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, రామకృష్ణ రావు, జయేశ్‌రంజన్ పాల్గొన్నారు.