రాజధానిలో రాచమార్గాలు
హైదరాబాద్ రోడ్లను సమూలంగా మార్చాలన్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ రాష్ర్ట రాజధానిలోని రోడ్ల రూపురేఖలను సమూలంగా మార్చాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. మరో నాలుగు దశాబ్దాల వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. హైవేలు, స్కైవేలు, మల్టీలేయర్ ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌హైవేలతో రహదారులను అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధిపరిచేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు అవతలి ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్‌రోడ్డు, నగరానికి ఉత్తర భాగంలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో హైదరాబాద్‌కు కొత్త హంగులు కల్పించాలని నిర్దేశించారు.
టర్కీలోని ఇస్తాంబుల్ తరహాలో చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే నగర రహదారుల వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందన్నారు. ఇందుకోసం 25 వేల నుంచి 30 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్‌లో రహదారుల వ్యవస్థపై శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం నగరంలో తీవ్ర ట్రాఫిక్ చిక్కులు కలుగుతున్నాయని, వచ్చే 20 నుంచి 40 ఏళ్లదాకా ఎలాంటి సమస్యలు ఎదురవకుండా పకడ్బందీ ప్రణాళికతో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.
రాజధానికి నిత్యం బయటినుంచి 15 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారని, అలాగే నగరంలో నివసించే వారి సంఖ్య కూడా ఏటా పది లక్షలు పెరుగుతోం దని సీఎం వివరించారు. ఈ జనాభాకు ప్రస్తుతమున్న రోడ్లు ఏమాత్రం సరిపోవడం లేవన్నారు. రహదారుల వ్యవస్థను మెరుగుపరచకపోతే భవిష్యత్తులో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ప్రపంచంలోని నగరాలన్నీ గ్రిడ్‌లాక్ (ఒక నగరంలోని వాహనాలన్నీ రోడ్డుపైకి వచ్చినా ట్రాఫిక్ సమస్య ఉండకూడదు.
లేకపోతే ఆ నగరం గ్రిడ్‌లాక్ స్థితికి చేరుకున్నట్లు పరిగణిస్తారు) కాకముందే.. భవిష్యత్ అవసరాల కోసం తగిన ప్రణాళికలతో రహదారులను అభివృద్ధి చేసుకుంటున్నాయన్నారు. హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్‌లాక్ పరిస్థితికి చేరుకున్నదని, అందుకే తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఇది మరింత తీవ్రంగా ఉంటోందన్నారు. పెళ్లి వేదికకు చేరుకోవడానికి రోడ్లమీదే దాదాపు మూడు గంటలు ఉండాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ దుస్థితిని చక్కదిద్దకపోతే పరిస్థితి మరింత జఠిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు చాలా నగరాల్లో 6, 8, 10 లైన్ల రోడ్లను నిర్మిస్తారని, అయితే హైదరాబాద్‌లో అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కువ లైన్లతో రోడ్లు వేయాలంటే చాలా ప్రాంతాల్లో ఎన్నో కూల్చివేతలు జరపాల్సి ఉంటుందని, అది అయ్యే పని కాదన్నారు. ఇస్తాంబుల్ తరహాలో చారిత్రక కట్టడాలను పరిరక్షించుకుంటూనే నగరంలోని రహదారుల వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందన్నారు. కొత్త ఫ్లైఓవర్లను ఇప్పుడున్న వాటి మాదిరిగా కాకుండా మల్టీ లేయర్లతో ఏర్పాటు చేయాలన్నారు. నాలుగుదిక్కులా ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణంతోపాటు స్కైవేలు నిర్మిచాలని, స్కైవేల్లోనూ జంక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
హైవేల అభివృద్ధికి ప్రాధాన్యత..
ఎల్‌బీనగర్-మియాపూర్, ఉప్పల్-హైటెక్‌సిటీల మధ్య ట్రాఫిక్ రద్దీ తీవ్రత దృష్ట్యా ఆ మార్గాల్లో హైవేలు నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. జిల్లాల నుంచి నగరంలోకి వచ్చే వాహనాలు శివార్లలోనే ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండేందుకు ఇదివరకే ఆలోచించినట్లుగా పరేడ్‌గ్రౌండ్, తూముకుంట, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం జరగాలన్నారు. పాతబస్తీలోనూ రహదారులను మెరుగుపరచడానికి అక్కడి రోడ్ల పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. అలాగే ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల రీజనల్ రింగ్‌రోడ్డు కూడా రావాలని కేసీఆర్ చెప్పారు.
సంగారెడ్డి, వికారాబాద్, షాబాద్, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్‌పూర్, గజ్వేల్, తూప్రాన్‌ల మీదుగా ఈ రింగ్‌రోడ్డును నిర్మించాలన్నారు. ప్రపంచంలోని ఎక్కడివారైనా హైదరాబాద్‌లో నివసించేందుకు ఇష్టపడతారని, అందుకనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సివిల్ సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తులు ఇక్కడే స్థిరపడుతుండటం మనకు గర్వకారణమన్నారు. ఇక్కడి అనువైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన జరగాలన్నారు. ప్రస్తుతమున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి తోడుగా నగరానికి ఉత్తర భాగంలో మరో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
వాహన రద్దీ.. జంక్షన్లలో ఒత్తిడిపై స్టడీ
హైదరాబాద్‌లోని అన్ని రహదారుల పరిస్థితి, వాహనాల రద్దీ, జంక్షన్ల వద్ద ఒత్తిడి తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో మొదటి దశలోనే ర హదారుల వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. తొలివిడతగా దాదాపు 2 వేల కిలోమీటర్లను గుర్తించి.. ఆ మర్గాల్లో స్కైవేలు నిర్మించాలని, రోడ్లను వెడల్పు చేయాలని, జంక్షన్లను అభివృద్ధి పరచాలని నిర్దేశించారు. రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణాల దశలోనే భూగర్భ డ్రైనేజీ, కేబుళ్ల కోసం డక్టింగ్ తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. తొలిదశలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని రోడ్లను అభివృద్ధి చేయాలని, తర్వాత హెచ్‌ఎండీఏ పరిధిలో పనులు చేపట్టాలని సూచిం చారు. ఈ సమీక్షలో సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, లీ అసోసియేట్స్ ప్రతినిధులు ఎం.ఫణిరాజు, రవాణా వ్యవస్థ, రహదారుల ప్రణాళికా నిపుణుడు జాన్‌ఫెర్రో(కెనడా) పాల్గొన్నారు.