తెలంగాణలో మొత్తం 25 జిల్లాలు!
♦ 24 లేదా 25కు చేరనున్న జిల్లాల సంఖ్య
♦ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్
♦ ఆగస్టు 15 లేదా దసరాలోపే ఏర్పాటు
♦ కొత్తగా మరో 40 మండలాలు
♦ 8 నుంచి 10 మండలాలకు ఒక ఆర్డీవో
♦ కార్యాచరణ వేగవంతం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశం
♦ జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణపై సీఎం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న కొత్త జిల్లాలపై ప్రకటన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆగస్టు 15 లేదా దసరా పండుగ లోపే కొత్త జిల్లాల నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఉందని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడేవాటితో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 24 లేదా 25 వరకు చేరుతుందని చెప్పారు.
వీటితో పాటు కొత్తగా మరో 40 మండలాలు ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఉన్న మండలాల పునర్‌వ్యవస్థీకరణ చేపడతామని తెలిపారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ఆదేశించారు. పాలనా సౌలభ్యానికి వీలుగా అధికారుల సంఖ్య పెంచాలని, ప్రతి ఎనిమిది నుంచి పది మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్ అధికారి(ఆర్‌డీవో)ని నియమించాలని నిర్ణయించారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, పాపారావు, సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలు చిన్నచిన్నగా ఉంటే ప్రజలకు పాలన మరింత చేరువవుతుందని, కొత్త రాష్ట్రం ఏర్పాటు చారిత్రక ఘట్టంగా నిలిచినట్టే జిల్లాలు, మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని సీఎం అన్నారు. విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే జిల్లాలను పెంచాల్సి ఉందన్నారు.
జిల్లాలు పెరిగితే అదనపు నిధులు
కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో అందే గ్రాంట్లు, కేంద్రం నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాను యూనిట్‌గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి మన రాష్ట్రం పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందవచ్చని సీఎం పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రజా సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తమ ప్రాంతాలు, పట్టణాలు జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, పాలనా పరమైన వెసులుబాటు దృష్ట్యా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంద న్నారు. ఈ మేరకు ప్రజలను సమాయత్తం చేయాలని సూచించారు.
పెరగనున్న ఉపాధి అవకాశాలు
జిల్లాల సంఖ్య పెరిగితే యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అందుకనుగుణంగా జిల్లాల సంఖ్య పెంచనున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయి కసరత్తు తర్వాత ఎన్ని జిల్లాలుండాలి..? ఎన్ని మండలాలు పెంచాలనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. పెరగబోయే జిల్లాలకు అనుగుణంగా కలెక్టర్, ఎస్పీ అధికార కార్యాలయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయాలన్నీ కలెక్టరేట్‌లోనే ఉండాలని, విశాలమైన గదులు, కాన్ఫరెన్స్, మీటింగ్ హాల్ ఉండేలా చూడాలన్నారు. వీటికి సంబంధించి ఆర్కిటెక్ట్‌లతో నమూనాలు తయారు చేయించాలని సూచించారు.