పట్టణాలు.. హరిత తోరణాలు
విచ్చలవిడి నిర్మాణాలను నియంత్రించాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా పట్టణాల్లో విచ్చలవిడిగా సాగుతున్న నిర్మాణాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని, రాష్ట్రంలో మంచినీటి సరఫరాకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు అవసరమేమో పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఈ రెండు విషయాలకు సంబంధించి చట్టం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్దేశించారు. శనివారం రాత్రి ఆయన పురపాలక సంఘాల పరిస్థితిని సమీక్షించారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి జోషి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ జలమండలి ఎండీ జగదీశ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ‘ప్రభుత్వ పథకాల్లో యేటా రూ.15 వేల కోట్లమేర అవినీతి జరుగుతోంది. పురపాలక శాఖలో అవినీతి వ్యవస్థీకృతమైంది. పనికో రేటును నిర్ధారించారు. ఈ తీరు మారాలి. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలు సిద్ధం చేయాలి. అవినీతి విషయంలో ఏ అధికారినీ ఉపేక్షించను. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇంటికి పంపేస్తా, ఇది మంత్రులకు కూడా వర్తిస్తుంది.’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
హరితభరితంగా....పరిశుభ్రంగా......
తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాలు హరితభరితంగా, ఆహ్లాదకరంగా,పరిశుభ్రంగా... ఆరోగ్యకరంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం ఉద్బోధించారు. ఇప్పుడు హైదరాబాద్ సహా ఇతర మునిసిపాలిటీలు చెత్తకుండీలను తలపిస్తున్నాయని, వీటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. దీన్ని ఓ సవాలుగా స్వీకరించి వాటిని బాగుచేసే ఉద్దేశంతో పురపాలక శాఖను తనవద్దనే ఉంచుకున్నట్టు వెల్లడించారు. వాటిని బాగుచేసేందుకు మేయర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు హైదరాబాద్‌లో మూడురోజులపాటు శిక్షణ ఇవ్వాలని, ఈ కార్యక్రమంలో ఓ రిసోర్స్‌పర్సన్‌గా తాను కూడా పాల్గొంటానన్నారు. స్థానికసంస్థలకు అధికారాలు బదిలీ చేయాలని, ఇదే సందర్భంలో వారిపై బాధ్యతలూ పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలకు కొత్త మాస్టర్‌ప్లాన్లు రూపొందించాలని, ఇందుకోసం అవసరమైతే విదేశీ కన్సల్టెంట్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం జనాభాకే కాకుండా అదనంగా కోటిమంది అవసరాలు తీరేలా హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలన్నారు. మెరుగైన టౌన్‌ప్లానింగ్ ఉన్న స్వదేశీ, విదేశీ ప్రాంతాలను అధ్యయనం చేసి వాటిని అమలు చేసేలా నివేదికను రూపొందించాలని ఆదేశించారు.
పన్ను అంచనాల వద్దే అవినీతి...
మునిసిపాలిటీలను ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు పన్నుల విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్న సీఎం... అసలు పన్ను అంచనాల దగ్గరే అవినీతి జరుగుతోందని, దీన్ని నియంత్రించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ రైల్వే జంక్షన్‌స్థాయివి రెండు, ఇమ్ల్లిబన్‌స్థాయి బస్సు టెర్మినళ్లు మరో ఐదింటిని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. మెదక్‌జిల్లా దుబ్బాకను మేజర్ గ్రామపంచాయితీగానే కొనసాగించాలని, వాయిదాపడిన రెండు కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీల ఎన్నికలు పూర్తయ్యేలా చూడాలని తెలిపారు. స్థానికపరిస్థితులకు అనుగుణంగా పట్టణాభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని, వాటి ఆధారంగానే బడ్జెట్ కేటాయింపులుంటాయని స్పష్టం చేశారు. అవసరమైనన్ని డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సామాజిక బాధ్యతగా కార్పొరేట్ కంపెనీలు ఈ విషయంలో చేయూతనందించేందుకు ముందుకు రావాలని పిలుపిచ్చారు. నగరాల్లో, పట్టణాల్లో స్మతివనాలు ఏర్పాటు చేయాలని, మృతిచెందిన వారి జ్ఞాపకంగా కుటుంబసభ్యులు ఓ మొక్కనాటి ఏడాదికోసారి ఆ చెట్టువద్దకు చేరి వారి స్మృతులు నెమరేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పట్టణాల్లో తాగునీటి అవసరాలకు సంబంధించి అధికారుల వద్ద సరైన అంచనాలు లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం మరోసారి సర్వేచేయాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల్లో పది శాతం నీటిని మంచినీటి కోసం కేటాయించే విధానపర నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి లాంటి ఆడిటోరియంల అవసరం, పార్కులు, మైదానాలు, చెరువులు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థవివరాలతో కూడిన నివేదికను సిద్ధం చేయాలని, మురికివాడల స్థితిగతులు తెలపాలని ఆదేశించారు. ట్యాక్సీలు, ఆటోలకోసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని చెప్పారు.