
కర్కోటక కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తరా?
రైతు ఆత్మహత్యలకు కారణమైన మిమ్మల్ని ప్రజలు నమ్ముతరా?
టీ కాంగ్రెస్ నాయకులకు కేటీఆర్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలకు కారణమైన కర్కోటక కాంగ్రెస్ నేతలే కరెంటు సమస్య గురించి మాట్లాడుతూ ధర్నా చేస్తే, ప్రజలు ఎలా నమ్ముతారని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ నేతలకు మంగళవారం బహిరంగ లేఖ రాశారు. అధికారంలో ఉంటూ నిన్నటిదాకా కాంగ్రెస్ నేతలు చేసిన పాపాల వల్లనే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆ లేఖలో విమర్శించారు. నాలుగు దశాబ్దాల పాలనలో ఏనాడూ విద్యుత్ సమస్య గురిం చి కాంగ్రెస్ నేతలు పట్టించుకోలేదన్నారు. తాము చేసిన పాపాలను దాచిపెట్టి, ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా కేవలం నాలుగునెలల టీఆర్‌ఎస్ పాలనపై నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.
లేఖలో ఆయనేమన్నారంటే..
‘అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిన దగాకోరు ముఠా కాంగ్రెస్ నేతలదే. తల్లిదండ్రులను చంపిన కుమారుడే కోర్టుకు పోయి.. అయ్యఅవ్వ లేని అనాథను, శిక్ష వేయకుండా ఆదుకోండి అని అన్నట్టుగా కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి ఉంది. మహబూబ్‌నగర్‌లో బీమా, కల్వకుర్తి, జూరాల, కోయిల్‌సాగర్‌కు చుక్కనీరు ఇవ్వకుండా సీమాంధ్ర ప్రాజెక్టులకు నీటిని తరలించుకుపోతుంటే అప్పటి మంత్రి డి.కె.అరుణ హారతి పట్టి ఆరంభం చేయలేదా? శ్రీశైలం నీటి దోపిడీ కోసం కనీస నీటిమట్టాన్ని పెంచితే.. కళ్లకు గంతలు కట్టుకున్న అభినవ ధృతరాష్ట్రులు కాంగ్రెస్ నేతలు. విద్యుత్ సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనంటూ గత నెలలో రాసిన లేఖలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు. 40 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఫలితంగా ఏర్పడిన విద్యుత్తు సంక్షోభాన్ని నాలుగునెలల టీఆర్‌ఎస్‌కు అంటగట్టడం దారుణం. తెలంగాణ నవజాత శిశువును హత్య చేస్తున్న క్రూరులు మీరు.
పాలకపక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారగానే చేసిన పాపాలన్నీ మరిచిపోయిన లేటెస్ట్ గజినీలుగా కాంగ్రెస్ నేతలున్నా, వారి పాపాలను ప్రజలు మర్చిపోరు. ఇలాంటివాటితో ప్రజలను వంచించినందుకే 2 లక్షల రుణమాఫీ అన్నా నమ్మకుండా.. నిజాయితీగా టీఆర్‌ఎస్‌నే గెలిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రజలు, రైతుల కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఘనత టీఆర్‌ఎస్‌ది. ఇచ్చిన హామీ మేరకు రూ.17 వేలకోట్ల రుణమాఫీని తలకు ఎత్తుకుని 4,250 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. తుపాను దెబ్బకు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రూ.486 కోట్లను అందించాం. వ్యవసాయ ట్రాక్టర్లపై రవాణా పన్ను మాఫీ, పెండింగులో ఉన్న ఎర్రజొన్న బకాయిల చెల్లింపు వంటివన్నీ చేశాం. కరెంటు కష్టాలపై ఎన్నికల్లోనే నిజాయితీగా ప్రజలకు వివరించాం. కావాలంటే అప్పటి సీడీలను కూడా పంపుతాం. ప్రజలను మోసగిస్తున్నందుకే కాంగ్రెస్‌ను, అవకాశవాద రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారు.’