తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్
Published Tue, Jun 3 2014 1:51 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
11 మంది కేబినెట్ మంత్రులు కూడా
గులాబీమయమైన రాజ్‌భవన్ పరిసరాలు
కేసీఆర్ బృందానికి గవర్నర్ అల్పాహార విందు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ర్టంలో తొలి ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం 8.15కు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. మరో 11 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
కేసీఆర్ తర్వాత వరుసగా మహ్మద్ మహమూద్ అలీ, డాక్టర్ టి.రాజయ్య, నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తన్నీరు హరీష్‌రావు, తీగుళ్ల పద్మారావు, పి.మహేందర్ రెడ్డి, కె. తారక రామారావు, జోగు రామన్న, గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్‌తో పాటు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్‌రావు, పద్మారావు, పి.మహేందర్ రెడ్డి, జోగు రామన్న దైవసాక్షిగా, మిగిలిన వారు పవిత్ర హృదయం సాక్షిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొందరు మంత్రులు కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు.
ఈ కార్యక్రమం ముగియగానే గవర్నర్‌తో మంత్రులందరూ గ్రూప్ ఫొటో దిగారు. కేసీఆర్ కుమారుడు తారక రామారావు, కుమార్తె కె.కవిత, వారి వారి కుటుంబ సభ్యులందరితో గవర్నర్ విడిగా ఫోటోలు దిగారు. అనంతరం మంత్రుల బృందానికి అల్పాహార విందు ఇచ్చారు.
పలువురు నేతల హాజరు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పి.సుధాకర్ రెడ్డి, కె.యాదవ రెడ్డి, తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగసంఘాల నేతలు సి.విఠల్, ఎం. నారాయణ, దేవీ ప్రసాద్, కారెం రవీందర్ రెడ్డి, పలువురు సినీ, క్రీడారంగ ప్రముఖులు, కవులు, కళాకారులు కూడా కేసీఆర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా రాజ్‌భవన్ పరిసరాలన్నీ గులాబీమయమయ్యాయి. రాజ్‌భవన్‌కు వెళ్లే దారుల్లోని కూడల్లో ఉన్న ఫౌంటెన్లలో నీళ్లు కూడా గులాబీ రంగులోకి మారాయి. ఆ నీటిలోనూ గులాబీ రంగు కలిపారు. ఫ్లెక్సీలు, అభినందనలతో కూడిన తోరణాలు, గులాబీ జెండాలు, బ్యానర్లు వంటివి నగరమంతా నిండిపోయాయి.
కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే రాజ్‌భవన్ బయట భారీ ఎత్తున బాణాసంచాను కాల్చారు. జై తెలంగాణ నినాదాలు మిన్నంటాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, కేబినెట్ మంత్రులకు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. కేబినెట్ మంత్రులు కూడా పరస్పరం అభినందించుకున్నారు.
పసిపాపలా కాపాడుకోవాలి: గవర్నర్
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని పసిపాపలా కాపాడుకోవాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. ఉద్యమాల సమయంలో తలెత్తిన వైషమ్యాలను పక్కనబెట్టి.. అభివృద్ధి, పునర్నిర్మాణంలో రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు.
Advertisement
Advertisement