
సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి తదితరులు
సాక్షి, యాదాద్రి : టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జిల్లాకు రానున్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొననున్నారు. సెప్టెంబర్ 6న శాసనసభను రద్దు చేసి వెంటనే ప్రకటించిన తొలి జాబితాలో భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పైళ్ల శేఖర్‌రెడ్డిని ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులోభాగంగా బుధవారం భువనగిరితోపాటు నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, దేవరకొండలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు. సభ నిర్వహణకు కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 30 వేల మంది సభకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.
సభాస్థలిని పరిశీలించిన శేఖర్‌రెడ్డి..
కేసీఆర్ పాల్గొని ప్రసంగించే ఎన్నికల బహిరంగ సభ ప్రాంగణాన్ని, వేదికను తాజా మాజీ ఎమ్మె ల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శేఖర్‌రెడ్డి కళాశాల మైదానాన్ని పూర్తి గా కలియ తిరుగుతూ ఏర్పాట్లకు సంబంధించి పలు సూచనలను చేశారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
డీసీపీ ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షణ..
రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరిజోన్ డీసీపీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భద్రతను ప ర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని, హెలిపాడ్ స్థలాలను పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. భద్రతాపరమైన కోణంలో తీసుకోవాల్సిన చర్యలను ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలకు వివరించారు. డాగ్‌స్క్వాడ్‌తో సభా ప్రాంగణాన్ని, వేదిక పరిసరాలను పరిశీలించారు.
వేలాదిగా తరలివస్తారు : పైళ్ల
కేసీఆర్ బహిరంగ సభకు జనం వేలాదిగా తరలివస్తారని టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో ఈ ప్రాంతానికి సాగునీరు అందించనుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలే మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment