ఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాలుడే..
- ఉప ఎన్నికకు అభ్యర్థి ప్రకటన
- భూపాల్‌రెడ్డి పేరు ఖరారు
- కార్యకర్తల భేటీలో మంత్రి హరీశ్‌రావు ప్రకటన
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో ‘కారు’ దూకుడు పెంచింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేసుకొని జోరు మీదున్న టీఆర్‌ఎస్.. వచ్చే నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎం.భూపాల్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. గురువారం భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కల్హేల్ మండలం సత్యపూర్ చౌరస్తా వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడతూ.. భూపాల్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
పార్టీకి విశ్వాసపాత్రుడు
వచ్చే నెల (కొత్త సంవత్సరం) మొదటి, రెండో వారాల్లో శాసనసభ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చని రాజకీయ పార్టీల అంచనా. ఈ మేరకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత సాధారణ ఎన్నికల్లో నారాయణఖేడ్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి 14746 ఓట్ల తేడాతో దివంగత ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై ఓటమి పాలయ్యారు. కిష్టారెడ్డికి 62,347 ఓట్లు రాగా, భూపాల్‌రెడ్డికి 47,601 ఓట్లు వచ్చాయి.
ప్రస్తుతం భూపాల్‌రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ టికెట్ టికెట్ కోసం టీఆర్‌ఎస్ నుంచి పలువురు పోటీపడ్డారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న భూపాల్‌రెడ్డిపైనే మంత్రి హరీశ్‌రావు విశ్వాసం ప్రకటించారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా భూపాల్‌రెడ్డికే మరోసారి అవకాశమివ్వాలని హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
పేరు: మహారెడ్డి భూపాల్‌రెడ్డి
పుట్టిన తేదీ: 7.5.1960
స్వగ్రామం: ఖానాపూర్ (కె)- (కల్హేర్ మండలం)
విద్యార్హతలు: బీఎస్సీ, హైదరాబాద్ ఏ.వీ కళాశాల (ప్రాథమిక స్థాయి నుంచి హైదరాబాద్‌లోనే విద్యాభ్యాసం)
తల్లిదండ్రులు: స్వర్గీయ వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే- ఎం.శకుంతల, మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ
భార్య, సంతానం: భార్య జయశ్రీరెడ్డి, కుమారుడు రోషన్ మహారెడ్డి, కుమార్తె శ్రేయారెడ్డి
నిర్వహించిన పదవులు..
1990 నుంచి కల్హేర్ మండలం కృష్ణాపూర్ సహకార సంఘం
(పీఏసీఎస్) చైర్మన్‌గా రెండుసార్లు ఎన్నిక. డీసీసీబీ డెరైక్టర్‌గా, డీఎంఎస్ వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు
టీడీపీ కల్హేర్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు
2008లో టీడీపీ నుండి టీఆర్‌ఎస్‌లో చేరి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు
టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు
2009లో అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరఫున పోటీచేసి ఓటమిపాలయ్యారు
20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న ఈయన సివిల్ కాంట్రాక్టర్