ఉద్యోగాలను పోగొట్టడమే బంగారు తెలంగాణా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
హైదరాబాద్: కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, ఎస్.మల్లారెడ్డి, ప్రకాశ్‌రెడ్డితో కలసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హెచ్‌ఎండీఏలో 200 మంది పేద ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్ చేశారు. అవినీతిని సహించమంటున్న కేసీఆర్.. అవినీతిపరులను, భూముల కేసుల్లో ఉన్నవారిని, మద్యం మాఫియాలను అసెంబ్లీకి తీసుకొచ్చి, ఇసుక మాఫియాలకు అండగా ఉంటున్నారని విమర్శించారు. కాగా టీడీపీ నేత మోత్కుపల్లికి గవర్నరు పదవి ఇస్తారని జరుగుతున్న ప్రచారంపై సమాచారం లేదన్నారు.
ఉద్యోగాలు తీసేయడం అన్యాయం: హెచ్‌ఎండీఏ ఉద్యోగులు
తెలంగాణ వస్తే బతుకులు మారిపోతాయనే ఆశతో 42 రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొన్నామని హెచ్‌ఎండీఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏలో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన రుక్మిణమ్మ మాట్లాడుతూ ‘తెలంగాణ వస్తే ఉద్యోగం పర్మినెంటు అయితదనుకున్నం. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? మా ఉద్యోగాలు మాకు ఇస్తే మంచిది, లేకుంటే చచ్చిపోతాం’ అని హెచ్చరించారు.