కొండగట్టు కాషాయమయం | kondagattu fulfilled with hanuman devotees | Sakshi
Sakshi News home page

కొండగట్టు కాషాయమయం

Published Wed, May 13 2015 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM

కొండగట్టు కాషాయమయం

కొండగట్టు కాషాయమయం

కొండగట్టు: హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాల సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి క్షేత్రం భక్తుల రద్దీతో పోటెత్తింది. వేలాది మంది హనుమాన్ దీక్షాపరులు ఇరుముడులతో తరలిరాగా.. అంజన్న పుణ్యక్షేత్రం కాషాయ వర్ణం సంతరించుకుంది. బుధవారం జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలకు మంగళవారం నుంచే భక్తుల రాక మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల నుంచి రాత్రి వరకు సుమారు 2 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. నేడు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశముందని ఆలయ అధికారులు తెలిపారు.      -మల్యాల      
 
హనుమాన్ నామస్మరణతో కొండగట్టు మార్మోగుతోంది. ఇరుముడులతో దీక్షాపరులు అంజన్న సన్నిధికి తరలివస్తున్నారు. వేలాది మంది దీక్షాపరులతో కొండగట్టు కాషాయమయమైంది. మెట్లదారివెంట, నాచుపల్లి, ఘాట్‌రోడ్డు వెంట దీక్షాపరులు భజనలు చేసుకుం టూ కాలినడకన తరలివస్తున్నారు. జిల్లాతోపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు.
 
హనుమాన్ పెద్దజయంతి ఉత్సవాలకు కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ ప్రాకారాలు విద్యుద్దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. కొండగట్టు వై జంక్షన్ నుంచి ఆలయం వరకు విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం రాత్రికే 70 వేల మంది భక్తులు కొండపైకి చేరుకున్నట్లు అంచనా. హైదరాబాద్‌కు చెందిన శ్రీధర్ ఉచిత అన్నదానం, మంచినీరు అందించారు. బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ చేసేందుకు లక్షమంది భక్తులు చేరుకునే అవకాశం ఉంది.
 
నేడు ప్రత్యేక పూజలు
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆంజనేయస్వామివారి సన్నిధిలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 3 గంటలకు తిరుమంజనము, 6 గంటలకు ద్రావిడ ప్రబంధ పారాయణములు, 9 గంటల నుంచి విశేష అభిషేకము, అర్చన, పట్టు వ స్త్రముల అలంకరణ, సహస్ర నాగవల్లి అర్చన, హోమము, మహాపూర్ణాహుతి, స్నపన తిరుమంజనము, ఉత్సవ మూర్తికి ఉయ్యాల సేవ, మంత్ర పుష్పం, మహానివేదన, తీర్థ ప్రసాద వినియోగం, సామూహిక భజన నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30కు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణము, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహనసేవ, కంకణోద్వాసన, మంత్ర పుష్పము, మహదాశీర్వాదము, సామూహిక భజన, తీర్థ ప్రసాద వినియోగము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో గజరాజు నర్సింహులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement