ఆశలు.. ఆవిరి! | Kothakota life story | Sakshi
Sakshi News home page

ఆశలు.. ఆవిరి!

Published Wed, Apr 20 2016 1:59 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

Kothakota life story

వారంతా 35ఏళ్లలోపు యువకులే.. బోరుబండిపై పనిచేస్తే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చనే ఉద్దేశంతో 12మంది జీతానికి కుదిరారు.. ఈ వేసవి మూడు నెలలు కష్టపడితే చాలు తమ కష్టాలు తీరుతాయని భావించారు.. అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి.. రాత్రనకా పగలనకా బోర్లు వేసి అలసిపొలసి తిరుగు ప్రయాణమయ్యారు.. మార్గమధ్యంలోనే వాహనం బోల్తా పడటంతో వారి బతుకులు తెల్లారిపోయాయి.. ఈ సంఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.
 
 కొత్తకోట : నల్లగొండ జిల్లా వలిగొండ మండలానికి చెందిన మాణిక్ (25), కృష్ణయ్య (26), రమణారెడ్డి (డ్రైవర్), లక్ష్మణ్, భీమయ్య, రాములు, బుగ్గయ్య, అజయ్, కృష్ణారెడ్డి, నాగూరావు, రాజు, థాలీరామ్ కొన్ని నెలలుగా బోరుబండి (రిగ్గు) పై కార్మికులుగా పనిచేస్తున్నారు. వారంరోజుల క్రితం వాహనం వెంట మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఐజ మండలంలో వివిధ చోట్ల బోర్లు వేసి తిరుగు ప్రయాణమయ్యారు.
 
 మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలోని కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలోకి చేరుకోగానే డ్రైవర్ నిద్రమత్తులో కునుకు తీయడంతో డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టగా వారంతా కిందపడ్డారు. అంతలోనే డ్రిల్లింగ్ పైపులు వారిమీద పడటంతో మాణిక్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన బాటసారులు వెంటనే క్షతగాత్రులను వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
 అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే కృష్ణయ్య చనిపోయినట్టు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ కృష్ణ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
 
 నిత్యం 4నుంచి 7 పాయింట్లు..
 ప్రస్తుతం గ్రామాల్లో నీటి కొరత ఉన్న దృష్ట్యా బోరుబండ్లకు విపరీతమైన గిరాకీ ఉందని, అందువల్లే ఈ పనికి ఒప్పుకొన్నామని కార్మికుడు భీమయ్య తెలిపారు. అందులోభాగంగా ప్రతిరోజూ నాలుగు నుంచి ఏడు పాయింట్లు ఎంపిక చేసుకుని బోర్లు వేస్తున్నామన్నారు. డ్రైవర్ కూడా తమతోపాటు పనిచేసేవాడని రోజంతా బోర్లు వేసి బాగా అలసిపోయామన్నారు. చివరిరోజు తామంతా బండిలోని రాడ్లపై నిద్రకు ఉపక్రమించామని, నలుగురు మాత్రం క్యాబిన్‌లో ఉన్నార ని తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుందని బోరుమన్నారు. బండిని సర్వీసింగ్ చేయించుకుని తిరిగి వస్తామని హైదరాబాద్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement