కొయ్యూరు అమరుల స్మృతిలో..
మంథని: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలకు మావోయిస్టులు సిద్ధమయ్యారు. సాయుధ పోరులో అసువులుబాసిన అమరుల త్యాగాలను స్మరించుకోనున్నారు. మంగళవారం నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. దీంతో కొద్ది రోజులుగా మంథని అటవీ ప్రాంతంలో అలజడి వాతావరణం కనిపిస్తోంది.
నేపథ్యమిదీ..
1999 డిసెంబర్ 2న మల్హర్ మండలం కొయ్యూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేతలైన నల్లా ఆదిరెడ్డి ఉరఫ్ శ్యామ్, ఎర్రం సంతోష్‌రెడ్డి ఉరఫ్ మహేష్, శీలం నరేష్ ఉరఫ్ మురళి మృతిచెందారు. అప్పటినుంచి వీరితో పాటు వివిధ ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను స్మరిస్తూ పీఎల్‌జీఏ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. పీపుల్స్‌వార్ ఉద్యమానికి మూలస్తంభాలుగా ఉన్న ఈ ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, నరేష్‌లు ఎన్‌కౌంటర్ కావడం అప్పట్లో సంచలనం కలిగించింది. కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న ముగ్గురు నేతలను కోల్పోవడంతో పీపుల్స్‌వార్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కాల్చిచంపారనే ఆరోపణలు..
వీరిని కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు బెంగళూరులో పట్టుకుని కొయ్యూర్ అడవుల్లోకి తీసుకొచ్చి మట్టుబెట్టినట్టు ఆరోపణలున్నాయి. పలువురు హక్కుల సంఘాల నాయకులు ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు. ఎన్‌కౌంటర్‌పై సమగ్ర దర్యాప్తు చేపట్టి, నాటి సంఘటనలో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులపై హత్యకేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్టు చెబుతున్న ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డులు బహుకరించడం వివాదాస్పదమైంది. ఈ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది.
కోలుకోలేని దెబ్బ
కొయ్యూర్ ఎన్‌కౌంటర్ పోలీసులకు పెద్ద విజయం కాగా, పీపుల్స్‌వార్ పార్టీ చరిత్రలో ఎన్నటికీ మానని నెత్తుటి గాయంగా మిగిలిపోయింది. బూటకపు ఎన్‌కౌంటర్లంటూ విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు తమ పంథాను మార్చుకొని పెద్ద తలకాయలపై దృష్టి పెట్టి విజయం సాధించే దిశగా ఈ ఎన్‌కౌంటర్ ఆత్మస్థైర్యాన్ని అందించింది. మూడున్నర దశాబ్దాల ఉద్యమబాటలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టులుగా రూపాంతరం చెందినప్పటికీ పార్టీ పూర్తిగా బలహీనపడింది. నేడు అతి తక్కువ మంది సాయుధ సభ్యులతో జిల్లాలో ఉనికి కోసం తాపత్రయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల కాలంలో తూర్పు ప్రాంతంలో మళ్లీ పట్టు సాధించేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తోంది.
భగ్నం చేసే దిశగా ఖాకీలు..
సమ సమాజ స్థాపన కోసం సైద్ధాంతిక బాటలో పయనించి అమరులైన అగ్రనేతలకు నివాళులు అర్పించడానికి సంస్మరణ వారోత్సవాలను డిసెంబర్ 2నుంచి వారం రోజుల పాటు ఘనంగా నిర్వహించి సత్తాను చాటుకోవాలని మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాల నేపథ్యంలో ఆనవాయితీ ప్రకా రం మావోయిస్టులు విధ్వంస చర్యలకు పాల్ప డే అవకాశముందని భావిస్తున్న పోలీసులు వారి కదలికలపై గట్టి నిఘా పెట్టారు. కూబింగ్ ఆపరేషన్‌లతో వారోత్సవాలను అడ్డుకోవడానికి పోలీసులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. వారం రోజులుగా మంథని, ముత్తారం, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం అటవీ ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. దీంతో అటవీ గ్రామాల్లో అలజడి వాతావరణం నెలకొంది.