‘మిడ్ మానేరు’లో వేగంగా పునరావాసం
• ప్రాజెక్టు పనులపై మంత్రులు హరీశ్, కేటీఆర్ సమీక్ష
• జూలై నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో వేగంగా పునరావాస చర్యలు చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌లు అధికారులను ఆదేశించారు. జూలై నాటికి పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం మిడ్ మానేరు ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాసంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఇందులో హరీశ్, కేటీఆర్‌లతో పాటు నీటి పారుదల, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టులో భూసేకరణ, పునరావాసం కోసం ఇప్పటివరకు సుమారు రూ.1,375 కోట్లు ఖర్చు చేసినట్లు, మరో రూ.వంద కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రులు తెలిపారు. వచ్చే జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రాజెక్టు పనులతో పాటు, పునరావాస ప్యాకేజీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వర్షాకాలం రాగానే ముంపునకు గురయ్యే గ్రామాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతి గ్రామంలో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని నీటి పారుదల, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, భూసేకరణ శాఖ తదితర శాఖల అధికారులు సమన్వయంతో కలిసి.. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసుకుని పనులు చేపట్టాలన్నారు. పునరావాస కాలనీల్లో రోడ్డు, తాగునీరు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.