
‘60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్’
హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా ఇంకా తెలంగాణ పూర్తిస్థాయిలో కుదురుకోకముందే మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. 21శాతం వృద్ధి రేటుతో తెలంగాణ మిగితా రాష్ట్రాలకంటే వేగంగా దూసుకెళుతోందని చెప్పారు. ఈ నెల 21న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ కొంపల్లి జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం మీడియా సమావేశంలో తెలియజేశారు. ‘దేశానికే దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మోడల్‌గా నిలుస్తోంది. ఏ రాష్ట్రంలో అమలుచేయనన్ని పథకాలతో తెలంగాణ దేశంలోనే ముందుంది.
మిషన్ భగీరథతో ఇంటింటికి నల్లా కార్యక్రమం తీసుకొచ్చాం. దీనిని దేశంలోని ఎనిమిది రాష్ట్రాల మంత్రులు, అధికారులు వచ్చి తెలుసుకొని తమ రాష్ట్రాల్లో అమలుచేయబోతున్నారు. టీఎస్ ఐపాస్‌తో పారిశ్రామిక విధానం కొత్త పుంతలు తొక్కించాం. సంక్షేమ రంగంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమాన్ని ఒక స్వర్ణయుగంలా ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్నారు. 15 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. అంతేకాకుండా రైతులకు అద్భుతంగా సహాయం చేసేలా ఎరువులను ఉచితంగా అందిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇదొక బృహత్తర కార్యక్రమం.
ఏదేమైనా తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళుతుందనడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. అందుకే. అంత ఘనంగా పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. 21నాడు పెద్ద మొత్తంలో ప్రతినిధులు పాల్గొంటున్నారు. 10 నుంచి 16వేలమంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. దాదాపు 60 ఎకరాల్లో ప్లీనరీ, ప్రధాన సభా ప్రాంగణం 5 ఎకరాల్లో ఉంటుంది. భోజనం, మంచినీళ్లు, మజ్జిక ప్యాకెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం. ప్రతినిధులకు, వీఐపీలకు నాయకులకు, మీడియాకు వేర్వేరుగా ఆరు భోజన శాలలు, సీఎంకు ప్రత్యేక బస ఏర్పాటు ఉంటుంది.
రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సమావేశ ప్రాంగణానికి వచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. 75 ఎకరాల్లో పార్కింగ్, 31 జిల్లాలకు సంబంధించి 31 కౌంటర్లు ఏర్పాటు చేసి వారికి ఇబ్బందులు లేకుండా చూస్తాం. సమావేశ ప్రాంగణానికి కొన్ని ప్రధాన రహదారులను కూడా అనుసంధానిస్తున్నాం. ఎండలు బాగా ఉన్నందున మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నాం. వెయ్యిమంది వాలంటీర్లు వైర్ లెస్ వాకీ టాకీలతో పనిచేయనున్నారు’ అని కేటీఆర్ చెప్పారు.