సీఎం కేసీఆర్ మనసున్న మనిషి
- మనిషి మంచోడైతే వర్షాలు పడ్తాయి: కేటీఆర్
- ఏడేళ్లు కరువును చూపించిన వారిని చూశాం
- పరోక్షంగా చంద్రబాబుపై విమర్శ
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనసున్న మనిషని, మనసు మంచి గుంటే మంచి వర్షాలు పడ్తాయని మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వస్తే ఏం వస్తదని కాంగ్రెస్ నాయకులు, ఇంకా చాలామంది మాట్లాడారని, తెలంగాణ వస్తే.. పగటిపూటే వ్యవసాయానికి కరెంట్ వస్తుందని, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు వస్తున్నాయని చెప్పారు. ఏటా రూ.5,300 కోట్ల పింఛన్లు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలో రాత్రిపూట కరెంట్ దొంగలా వచ్చేదని, ఎందరో రైతులు పాము కాటుకు బలయ్యారని కేటీఆర్ గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడేళ్ల కరు వును చూపించిన నాయకుడిని చూశామని పరోక్షంగా చంద్రబాబును కేటీఆర్ ఉటంకించారు. రాష్ట్రంలో రూ.1,000 కోట్లతో 17లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మించా మని కేటీఆర్ వెల్లడించారు. రైతులు పండిం చిన పంటలను గోదాముల్లో దాచుకోవచ్చని చెప్పారు. 24 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో రూ.36 వేల కోట్ల రైతుల రుణమాఫీకి మల్లగుల్లాలు పడుతున్నారని, మనరాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉన్నా.. రూ.17 వేల కోట్ల రైతుల రుణాలను నాలుగు కిస్తుల్లో మాఫీ చేశామని చెప్పారు.
చెరువులు నింపుకుందాం..
మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసుకున్నాం, మంచి వానలు పడితే చెరువులు నింపుకుందామని కేటీఆర్ అన్నారు. మధ్య మానేరులో ఈ ఏడాది 10 టీఎంసీ నీరు నిల్వ ఉంటుందని, వచ్చే ఏడాదిలో మల్కపేట, సింగసముద్రం రిజర్వాయర్లకు మధ్యమానేరు నీరు చేరుతుందన్నారు. ఎగువ మానేరును గోదావరి జలాలతో నింపుకుని అన్ని చెరు వులకు అనుసంధానం చేస్తామన్నారు. సిరిసిల్ల ప్రాంతాన్ని సస్యశ్యామం చేసేందుకు ప్రభు త్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని మంత్రి తెలిపారు. కాగా, కేటీఆర్ ప్రసంగిస్తుండగానే వర్షం రావడంతో వర్షంలోనూ ప్రసంగాన్ని కొనసాగించారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకు స్థాపనలు చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.