- దక్షిణ కొరియా పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని దక్షిణ కొరియా టెక్స్‌టైల్ కంపెనీల దిగ్గజాలను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ఆహ్వానించారు. బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో దక్షిణ కొరియా టెక్స్‌టైల్ పరిశ్రమల సమాఖ్య చైర్మన్, యంగాన్ కార్పొరేషన్ అధినేత కిహాక్ సుంగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో బుధవారం మంత్రి కేటీఆర్ సమావేశమై కాకతీయ టెక్స్‌టైల్ పార్క్ స్వరూపం, సౌకర్యాలను వివరిం చారు.
రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయ బోయే టెక్స్‌టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు దేశం లో ఏ రాష్ట్రం ఇవ్వలేనన్ని ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఆయా కంపెనీలు కోరుకున్న విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పార్క్‌లోని పరిశ్రమల అవసరాల కోసం కార్మికుల నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైతే దక్షిణ కొరియా కంపెనీలకు కొంత స్థలాన్ని కేటాయిస్తామన్నారు.
సానుకూలంగా దక్షిణ కొరియా బృందం
టెక్స్‌టైల్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకట్టుకుందని సుంగ్ పేర్కొన్నారు. టెక్స్‌టైల్ పార్కుకు విద్యుత్, కార్మికుల లభ్యత, ప్రోత్సాహకాలను అడిగి తెలుసుకున్నారు. వరంగల్‌లో విమాన ప్రయాణ సౌకర్యం గురించి మంత్రిని ఆరా తీశారు. త్వరలోనే వరంగల్‌లోని ఎయిర్ స్ట్రీప్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్స్‌టైల్ విభాగం కమిషనర్ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.
2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వచ్చిన దక్షిణ కొరియా టెక్స్‌టైల్ ప్రతినిధి బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీఎస్‌ఐఐసీ, హ్యాండ్ లూమ్, టెక్స్‌టైల్ విభాగాల అధికారులతో సైతం భేటీ అయిం ది. గురువారం ఒక రోజు మెగా టెక్స్‌టైల్ పార్క్‌తో పాటు స్థానికంగా ఉన్న పరిశ్రమలను పరిశీలించనుంది.