
సాక్షి, న్యూఢిల్లీ : పర్యాటక, సందర్శక వీసాలతో విదేశాలకు వెళ్లి పనిచేస్తూ పట్టుబడిన కార్మికుల పాస్‌పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కార్మికులు అలా పట్టుబడినప్పుడు ఆయా దేశాలతో మాట్లాడి విడిపించినా.. వారు మళ్లీ అదే తరహాలో విదేశాలకు వెళ్లి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకే పాస్‌పోర్టుల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల ఎన్నారై సంక్షేమ శాఖ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివరాలు వెల్లడించారు. ఈ భేటీలో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు అనంతరం మీడియాతో మాట్లాడారు. విదేశాల్లో ఒకసారి చిక్కుకుని కేంద్ర ప్రభుత్వ సాయంతో స్వదేశానికి చేరుకుంటున్న కొందరు కార్మికులు... తిరిగి అదేబాట పడుతున్నారని కేంద్రం గుర్తించిందని తెలిపారు. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టిందని, రెండు సార్లు విదేశాల్లో చిక్కుకున్న వారి పాస్‌పోర్టులను ఐదేళ్ల పాటు రద్దు చేయాలని నిర్ణయించిందని చెప్పారు. దానికి అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపాయని వెల్లడించారు.
సుష్మాకు ఆహ్వానం
త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న విదేశీ భవన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సుష్మా స్వరాజ్‌ను ఆహ్వానించామని కేటీఆర్ తెలిపారు. విదేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తెలుగువారికి సహాయపడేందుకు అక్కడి ఎంబసీల్లో తెలుగు మాట్లాడే సిబ్బందిని నియమించాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు.
అవసరమైతే రాష్ట్రం నుంచి డిప్యుటేషన్ మీద తెలుగు సిబ్బందిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించామని, కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. విదేశాలకు పంపుతామంటూ ప్రచారం చేసుకునే నకిలీ ఏజెంట్ల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర మంత్రి కోరారని తెలిపారు. పాస్‌పోర్టు సేవల్లో హైదరాబాద్ కేంద్రం మెరుగైన పనితీరును కనబరుస్తోందని కితాబిచ్చారని వెల్లడించారు.
ఫార్మాసిటీకి ‘నిమ్జ్’ హోదా ఇవ్వండి
సుష్మాస్వరాజ్‌తో సమావేశం అనంతరం కేటీఆర్ కేంద్ర వాణిజ్య మంత్రి సురేశ్ ప్రభును కలిశారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి ‘జాతీయ పెట్టుబడులు, ఉత్పాదకత జోన్ (ఎన్‌ఐఎంజెడ్)’హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే అక్కడ కామన్ ఎఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.1,500 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
నిజామాబాద్ స్పైస్ పార్కుకు కేంద్రం తరఫున ఇస్తామన్న రూ.20 కోట్లు విడుదల చేయాలని... హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–రామగుండం, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణలో మెగా లెదర్‌పార్క్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 22, 23 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బయో ఆసియా సదస్సుకు గౌరవ అతిథిగా రావాలని సురేశ్ ప్రభును కేటీఆర్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment