చేనేతకు చేయూతనిద్దాం
మంత్రులు, ఎమ్మెల్యేలను కోరిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు కలసి రావాలని ప్రజా ప్రతినిధులను చేనేత, టెక్స్‌టైల్ శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. శాసనసభ, శాసనమండలిలో స్పీర్, చైర్మన్, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలను మంగళవారం కేటీఆర్ కలిశారు. తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ(టెస్కో) తయారు చేసిన చేనేత వస్త్రాలను వారికి అందజేశారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులను అదుకునేందుకు పలు కార్యక్రమాలు చేపట్టిందని, ‘చేనేత లక్ష్మి’ని ప్రారంభించామని కేటీఆర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మది నెలల పాటు నెలకు వెయ్యి రూపాయాలు పొదుపు చేస్తే పదో నెలలో రూ.14,400 విలువైన చేనేత వస్త్రాలను అందిస్తున్నామని తెలిపారు. ‘చేనేత లక్ష్మి’లో మంత్రులు, వారి ఉద్యోగులు చేరేలా, చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచేలా చూడాలన్నారు. చేనేత వస్త్రాలను టెస్కో వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రధాన అన్లైన్ స్టోర్లలో టెస్కో వస్త్రాలు అందుబాటులోకి ఉంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
వారంలో ఒక రోజు...
ఇక తన పరిధిలో ఉన్న మున్సిపల్, మైనింగ్, పరిశ్రమల శాఖాధిపతులుతో మాట్లాడిన మంత్రి... కచ్చితంగా వారంలో ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించేలా చూడాలన్నారు. ప్రతివారం గ్రీవెన్స్ డే రోజు తమ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మంత్రికి తెలిపారు. చేనేతలను ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం చేపట్టిన మంత్రి కేటీఆర్‌ను మంత్రులు, ప్రతిపక్ష నేతలు అభినందించారు.