హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించండి | KTR Requests Amit Shah To Develop Hyderabad As Global City | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ అభివృద్ధికి సహకరించండి

Published Fri, Nov 1 2019 1:17 AM | Last Updated on Fri, Nov 1 2019 4:45 AM

KTR Requests Amit Shah To Develop Hyderabad As Global City - Sakshi

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో కేటీఆర్‌

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మహానగరాన్ని గ్లోబల్‌ స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తెలంగాణ మంత్రి కె.తారకరామారావు కోరారు. హైదరాబాద్‌లో భవిష్యత్‌ అవసరాలు తీర్చగలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ (ఎస్‌ఆర్డీ)లో భాగంగా చేపడుతున్న పలు రహదారుల విస్తరణకు కేంద్ర హోంశాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం మంత్రిగా అమిత్‌ షా బాధ్యతలు చేపట్టిన అనంతరం కేటీఆర్‌ మొదటిసారిగా గురువారం ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయనతో భేటీ అయ్యారు.

ఎస్‌ఆర్డీ వివరాలు..  
ఈ సందర్భంగా స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ గురించి అమిత్‌ షాకు కేటీఆర్‌ వివరించారు. ఎస్‌ఆర్డీలో భాగంగా స్కైవేలు, ప్రధాన కారిడార్లు (166 కి.మీ), ప్రధాన రోడ్డు (348 కి.మీ), ఇతర రహదారులు (1,400 కి.మీ)ల అభివృద్ధికి సంకల్పించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ఫేజ్‌–1లో రసూల్‌పుర జంక్షన్‌ వద్ద తలపెట్టిన ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఇంటర్‌ స్టేట్‌ వైర్‌లెస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 1.62 ఎకరాల భూమి అవసరమవుతుందని వివరించారు. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు భూమిని బదలాయించాలని కోరారు. ఈ భూమిని జీహెచ్‌ఎంసీకి బదలాయించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసినా కేంద్ర హోం శాఖ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.

అయితే 2017లో కేంద్ర హోం శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎం ఎస్‌ఎన్‌ స్వామి, జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌లు సంయుక్తంగా జరిపిన సర్వేలో ఫ్లైఓవర్‌ నిర్మాణం వల్ల స్టేషన్‌లో కమ్యూనికేషన్‌ ఇన్‌స్టాలేషన్‌ ఎలాంటి ప్రభావానికి లోనుకాదని, కేవలం స్టాఫ్‌ క్వార్టర్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకు, సంపు, స్టోర్‌రూం మాత్రమే ప్రభావితమవుతాయని నివేదిక సమర్పించిందని వివరించారు. అయితే కేంద్ర హోం శాఖ నుంచి భూమి బదలాయింపుపై ఇప్పటివరకు ఆదేశాలు జారీ కాలేదని చెప్పారు.

ఫార్మాసిటీకి సాయం కావాలి.. 
ఫార్మా రంగంలో దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేలా రూపొందించిన హైదరాబాద్‌ ఫార్మా సిటీ (హెచ్‌పీసీ)కి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ సహా బడ్జెటరీ సాయం చేయాల్సిందిగా కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు ప్రతిపాదిత హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌ను సమీకృతం చేసుకుంటూ 19,333 ఎకరాల్లో ప్రణాళికలు రచించిన హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఆవశ్యకతను గోయల్‌కు వివరించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలో గోయల్‌ను ఆయన కార్యాలయంలో కలసిన కేటీఆర్‌..హెచ్‌పీసీపై వివరాలందించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఐఐటీ ఈ ప్రాజెక్టును సూత్రప్రాయంగా అంగీకరించడమే కాకుండా, ‘నిమ్జ్‌’(నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్‌)గా గుర్తించిందన్నారు. ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 8,400 ఎకరాల్లో పనులకు డీపీఆర్, డిజైన్లు సిద్ధమయ్యాయని, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు కూడా పొందామని వివరించారు. తొలి విడత పనుల్లో బాహ్య మౌలిక వసతుల్లో భాగంగా రోడ్లు, నీటి వసతికి రూ.1,318 కోట్లు, అంతర్గత మౌలిక వసతుల్లో భాగంగా 50 శాతం వ్యయం (రూ.2,100 కోట్లు) భరించాలని కోరారు.

డిజైన్‌ సెంటర్‌కు అనుమతులివ్వండి.. 
హైదరాబాద్‌లో నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం, ప్రచార శాఖతో ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ను కేటీఆర్‌ కోరారు. ఈ ప్రతిపాదిత నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌.. కన్సల్టెన్సీ సర్వీసులు, దేశంలో డిజైన్‌ రంగంలో నాణ్యమైన విద్యను అందించేందుకు, భారత డిజైన్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు, మార్కెటింగ్, ఎక్స్‌పో, ఎగ్జిబిషన్, డిజైన్‌ వర్క్‌షాప్‌లకు ఉపయోగపడుతుం దని వివరించారు.

డిజైన్‌ సెంటర్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రపంచ స్థాయి నిపుణులు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. డిజైన్‌ సెంటర్‌ బిల్డింగ్‌ను రూపొందించడంలో, మెంటార్‌గా వ్యవహరించేందుకు ఆపిల్‌ స్టోర్‌ రూపకర్త టిమ్‌ కొబె సహా ఆటోమోటివ్‌ వింగ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా మోటార్స్‌ డిజైన్‌ విభాగం హెడ్‌ ప్రతాప్‌ బోస్‌ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. అకాడమీ ప్రోగ్రాంల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ ఆసక్తిగా ఉందన్నారు.

రైల్వే సైడింగ్‌ వసతి కల్పించండి.. 
ఖమ్మం జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమల నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు జిల్లాలోని పండిళ్లపల్లి రైల్వే స్టేషన్‌లో రైల్వే సైడింగ్‌ వసతి ఏర్పాటు చేయాల్సిందిగా గోయల్‌ను కేటీఆర్‌ కోరారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న గ్రానైట్‌ పరిశ్రమల నుంచి ప్రస్తుతం లారీల్లో ఎగుమతులు జరుగుతున్నాయని, వీటి వల్ల నిర్వాహకులకు ఖర్చుల భారం అధికమవుతోందన్నారు. అలాగే హైద రాబాద్‌–విజయవాడ మధ్య కొత్తగా రోజువారి ప్యాసింజర్‌ రైలును మంజూరు చేయాల్సిందిగా కోరారు. మాచర్ల, మట్టంపల్లి, జన్‌పహాడ్, దామరచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ టౌన్‌ల మీదుగా ఈ కొత్త రైలును నడపాలని కోరారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా కేటీఆర్‌ వెంట తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement