
'మహిళలు తిరగబడతారనే ఇక్కడ పెట్టారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యలు మమ్మల్ని కూడా బాధిస్తోందని... వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వారు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు.