ఇళ్లు కూల్చి పేదలను రోడ్డున పడేస్తారా..
మన పాలన అంటే ఇదేనా..?
ప్రభుత్వంపై బీజేపీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్ మండిపాటు
జవహర్‌నగర్ : నిరుపేదలకు డబుల్ బెడ్రూం కట్టిస్తాం.. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అంటున్న సీఎం కేసీఆర్.. కూలీనాలీ చేసుకుని 60 గజాల్లో కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చివేయడం ఆయన నిరంకుశ ధోరణికి నిదర్శనమని బీజేపీ శాసనసభా పక్షనేత డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం సాయంత్రం జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్ ప్రాంతంలోని పలు కాలనీలలో రెవెన్యూ అధికారులు కూల్చిన ఇళ్లను పరిశీలించి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు.. మన పాలన, మన భూమి.. ఎవరు ఎక్కడ గుడిసె వేసుకుంటే అక్కడే పట్టాలిస్తామని ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తుంటే.. జవహర్‌నగర్‌లో మాత్రం రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సర్వేల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం పద్ధతికాదన్నారు. జీఓ 58, 59 పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్‌తోపాటు కలెక్టర్ రఘునందన్‌రావుతో చర్చించనున్నట్లు తెలిపారు. ఇకపై పేదల ఇళ్లను కూల్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి బీజేపీ ముందుంటుందని ప్రజలకు లక్ష్మణ్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి మోహన్‌రెడ్డి, బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బుద్ది శ్రీను, తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మానుయేల్, నాయకులు మంద లక్ష్మీనారాయణ, ఎరుకల పెంటయ్య, ఆనందరావు, రామారావు, వడ్డెర వెంకటేష్ పాల్గొన్నారు.