
భూ నిధి @ లక్ష ఎకరాలు!
భూ లభ్యతపై నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం
ఖాళీ భూములు 39 వేల ఎకరాలు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పెట్టుబడులకు ఎర్రతివాచీ పరుస్తున్న తెలంగాణ సర్కారు.. రంగారెడ్డి జిల్లాలో ఖాళీ భూముల వేట కొనసాగిస్తోంది. పలు రాయితీలు, ఏక గవాక్ష విధానంలో పరిశ్రమలకు అనుమతులను సరళతరం చేస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. దానికనుగుణంగా లక్ష ఎకరాల భూ నిధిని సిద్ధం చేస్తోంది. రాజధానికి సమీపంలో ఔటర్‌రింగ్ రోడ్డు, విమానాశ్రయం, రైల్వే లైన్లు ఉండటంతో పెట్టుబడులకిది అనువైన ప్రాంతంగా పరి గణిస్తోంది.
ప్రోత్సాహకాలిస్తే పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్న ప్రభుత్వం దండిగా భూ మిని సమీకరిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ ప్రాంతంలో విహంగ వీక్షణం చేశారు. ఫార్మా కంపెనీల దిగ్గజాలతో కలసి ప్రతిపాదిత ఫార్మాసిటీ స్థలాలను పరిశీలించారు. నగరానికి దగ్గరగా పెద్దమొత్తంలో ఒకేచోట భూమి ఉండటంతో పెట్టుబడులు పెట్టేందుకు ఫార్మా అధినేతలు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో ఈ ప్రాంతంలో దాదాపు 13వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాచకొండ గుట్టల్లో ఫిలింసిటీ, స్పోర్ట్స్ సిటీ తదితర క్లస్టర్ల ఏర్పాటులోనూ భూమే కీలకంగా మారుతున్న నేపథ్యంలో పారిశ్రామికవేత్తల అవసరాలకనుగుణంగా సర్కారు భూముల జాబితాను సిద్ధం చేయాలని సీఎం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
కేటగిరీలవారీగా..
ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే చేసిన రెవెన్యూ యంత్రాంగం.. ఈ మేరకు ల్యాండ్ బ్యాంక్‌ను కేటగిరీల వారీగా విభజించింది. పరిశ్రమలకు తక్షణ కేటాయింపులు చేసేందుకుగాను 19,383 ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ(టీఐసీసీ)కు బదలాయించింది. గతంలో టీఐసీసీ, హెచ్‌ఎండీఏ, రాజీవ్ స్వగృహ, తదితర శాఖల నుంచి ఇతరులకు బదలాయించిన భూమిలో అవసరాలకు సరిపోను మిగులు భూమి ఉన్నట్లు ఇటీవల సర్వేలో గుర్తించింది. ఇలా ఆయా సంస్థల అట్టిపెట్టుకున్న 10,852 ఎకరాలను స్వాధీనం చేసుకుంటోం ది. ఈ మేరకు ఆయా సంస్థలకు తాఖీదులు జారీ చేసింది. ఈ స్థలాలను కొత్త కంపెనీలకు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది.
రాళ్లతోకూడిన భూమి 39,433.37 ఎకరాలు!
ఇప్పటివరకు పరిశ్రమలకు అనువైన స్థలాల జాబి తాను సిద్ధం చేసిన ప్రభుత్వం.. తాజాగా రాళ్లు, రప్పలతో కూడిన సర్కారీ భూములను కూడా సర్వే చేస్తోంది. క్షేత్రస్థాయిలో సర్వే నంబర్ల వారీగా సమాచారాన్ని సేకరించిన అధికారులు జిల్లాలో 39,433.37 ఎకరాల మేర ఈ తరహా భూములున్న ట్లు తేల్చింది. అవసరమైతే ఈ భూములను కూడా చదును చేసి పారిశ్రామికవేత్తలకు కేటాయిం చాలనే ఉద్ధేశంతోనే ప్రభుత్వం కొండలు, గుట్టలతో మిళితమైన భూముల సమాచారాన్ని అడిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ఆక్రమిత స్థలాల లెక్కలను కొలిక్కి తెచ్చిన ప్రభుత్వం.. జిల్లా వ్యాప్తంగా 34వేల ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిగ్గు తేల్చింది. దీంట్లో 11,922 వ్యవసాయ, 6,202 వ్యవసాయేతర అవసరాలకు ఈ భూములు వినియోగిస్తున్నట్లు అధికారుల సర్వే లో తేలింది. అలాగే 10 వేల ఎకరాల అసైన్డ్ భూమి చేతులు మారినట్టు లెక్కతేల్చిన అధికారగణం.. 3 వేల ఎకరాల యూఎల్‌సీ స్థలాలు కూడా ఆక్రమణలకు గురైనట్టు ప్రభుత్వానికి నివేదించింది.