గోదావరిఖని : రామగుండం ఎన్టీపీసీ సంస్థలో ప్రస్తుతం 200 మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లు, 500 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లతో మొత్తం 2,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. భవిష్యత్‌లో ప్లాంట్‌ను విస్తరించేందుకు అనువుగా ఎన్టీపీసీ స్థలాన్ని అందుబాటులో పెట్టుకుంది. 8, 9 యూనిట్లను నెలకొల్పేందుకు మూడేళ్ల క్రితమే ప్రణాళికలు సిద్ధం చేసింది. బొగ్గు కేటాయింపులు లభించక ఇన్నాళ్లూ వేచిచూసింది. తెలంగాణలో తీవ్ర కరెంటు సంక్షోభం నేపథ్యంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి నుంచి స్థలం సేకరిస్తామని చెప్పారు. ఎన్టీపీసీ కూడా ఇందుకు సమ్మతించింది. ఆ సంస్థ సీఎండీ సైతం ముఖ్యమంత్రిని కలిశారు. కానీ, ప్రతిపాదిత ప్లాంట్ల నిర్మాణానికి ఐదు వేల ఎకరాల స్థలం అవసరముండగా రామగుండం ప్రాంతంలో, సింగరేణిలో అంతమొత్తంలో స్థలం లభించడం కష్టంగానే ఉంది. ఇప్పటికే అధికారులు అన్ని చోట్ల పరిశీలించినా... ఆ స్థాయిలో భూమి ఎక్కడా లభించడం లేదు. దీంతో వెయ్యి ఎకరాల తన సొంత స్థలంలోనే కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ఎన్టీపీసీ శ్రీకారం చుట్టింది. మొత్తం 4 వేల మెగావాట్లలో కేవలం 1600 (800 మెగావాట్ల రెండు యూనిట్లు) మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ స్థలం సరిపోతుంది. ఈ రెండు యూనిట్లకు అవసరమైన యాష్‌పాండ్ కోసం 700 ఎకరాల స్థలం అవసరం కానుండగా... రామగుండం పరిసర ప్రాంతాల్లో అంతపెద్ద మొత్తంలో ప్రభుత్వ స్థలం ప్రస్తుతం కనిపించడం లేదు. యాష్‌పాండ్‌కు ఇతర ప్రాంతాల్లో స్థలం కేటాయించే అవకాశాలున్నాయి. రామగుండం పట్టణంలో 500 ఎకరాల వరకు స్థలం ఉన్నప్పటికీ అది అటవీశాఖతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీకి ఇవ్వడానికి స్థలం దొరుకుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
కోర్టు వివాదంలో బీపీఎల్ స్థలం
1994లో రామగుండం మండలకేంద్రంలో 520 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో బీపీఎల్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 543.05 ఎకరాలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి 1291.31 ఎకరాల భూమి సేకరించింది. రూ.150 కోట్లతో 1996లో ప్లాంట్ చుట్టూ ప్రహరీ, ఇతర నిర్మాణాలు చేపట్టిన ఆ సంస్థ విద్యుత్ కొనుగోలు రేట్ల విషయంలో ప్రభుత్వంతో ఒప్పందం జరగక ప్లాంట్ నిర్మాణ పనులు నిలిపివేసింది. ఈ వివాదంపై బీపీఎల్ సంస్థ కోర్టును ఆశ్రయించగా... నేటికీ ఆ సమస్య ఎటూ తేలలేదు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్టే వెకేట్ చేయిస్తే తప్ప బీపీఎల్‌కు కేటాయించిన స్థలాన్ని ఎన్టీపీసీకి అప్పగించే అవకాశం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండం ప్రాంతంలో మిగిలిన 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పే పరిస్థితి ఏర్పడదు. ఒక్క చోట కాకుండా రామగుండం చుట్టుపక్కల విడివిడిగా స్థలం చూపించడానికి ప్రభుత్వం ముందుకు వస్తే... 800 మెగావాట్ల చొప్పున మూడు యూనిట్లు నెలకొల్పేందుకు ఎన్టీపీసీ సిద్ధంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త ప్లాంట్ల నిర్మాణంపై అయోమయం నెలకొంది.
కొత్త విద్యుత్ ప్లాంట్లకు స్థల సమస్య
Published Fri, Oct 31 2014 11:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM
Advertisement