
శంషాబాద్‌లోనూ ‘భూ మాయ’!
200 కోట్ల విలువ చేసే 317 ఎకరాల ప్రభుత్వ భూమికి ‘గోల్డ్‌స్టోన్’ ఎసరు
♦ శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడలో అక్రమ దందా
♦ మియాపూర్ భూముల తరహాలో కాజేసేందుకు భారీ స్కెచ్
♦ సర్కారు 40 ఏళ్ల కిందే రైతులకు అసైన్ చేసిన భూములు
♦ నిజాం వారసుల భూమిగా పేర్కొంటూ గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు జీపీఏ
♦ అనంతరం గోల్డ్‌స్టోన్ అనుబంధ కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్
శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్)
హైదరాబాద్ మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన కోట్లాది రూపాయల భూముల కుంభకోణంలో మరో అక్రమం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్‌కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని ఘాంసిమియాగూడలో ఏకంగా 317 ఎకరాల సర్కారు భూములు అన్యాక్రాంత మయ్యాయి. దీని వెనుక కూడా మియాపూర్ భూ కుంభకోణం ప్రధాన నిందితుడు గోల్డ్‌స్టోన్ సంస్థ యజమాని ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంతో విలువైన భూములు..
శంషాబాద్ మండలంలోని ఘాంసిమియాగూడలోని సర్వే నంబర్–4లో 317.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను నాలుగు దశాబ్దాల కింద అప్పటి సర్కారు 62 మంది రైతులకు పంపిణీ (అసైన్‌మెంట్) చేసింది. ఈ ప్రాంతం జీవో 111 పరిధిలో ఉన్నప్పటికీ.. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్), ప్రతిష్టాత్మక ఐఎంటీ కళాశాలకు సమీపంలో ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేగాకుండా బెంగళూరు జాతీయ రహదారికి చేరువలో ఉండడం.. ఓఆర్‌ఆర్‌ను, జాతీయ రహదారిని కలుపుతూ ఏర్పాటు చేసిన పీ–వన్ రోడ్డు ఈ భూముల పక్క నుంచే వెళ్లింది. దీంతో ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకుపైగా పలుకుతోంది. సుమారు రూ.200 కోట్లు విలువ చేసే ఈ భూములను కాజేయడానికి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పావులు కదిపారు.
మియాపూర్ భూముల తరహాలోనే..
317 ఎకరాల భూములను చేజిక్కించుకునేందుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పక్కా స్కెచ్ వేశారు. ఈ భూములను మియాపూర్ కుంభకోణం తరహాలో నవాబుల వారసులకు చెందిన ‘పైగా’భూములుగా చూపారు. నవాబుల వారసులుగా పేర్కొన్న వారి నుంచి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పేరిట జీపీఏ చేసుకున్నారు. తర్వాత ఈ భూములను గోల్డ్‌స్టోన్ అనుబంధ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాదు అప్పటికే ఈ భూములను సాగుచేస్తున్న అసైన్డ్ రైతులకు ఎంతో కొంత ముట్టజెబుతూ, బెదిరిస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం.
ఇప్పటికే వంద ఎకరాలు స్వాధీనం..
ఘాంసిమియాగూడ్‌లోని ఈ భూములను చాలా ఏళ్లుగా అసైన్డ్ రైతులు సాగుచేస్తున్నారు. దీంతో భూముల స్వాధీనం కోసం గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టారు. తప్పుడు పత్రాలతో కోర్టులకు వెళ్లి.. తనకు అనుకూలంగా తీర్పు సంపాదించారు. దాంతో కోర్టు ఉత్తర్వుల మేరకు భూముల స్వాధీనానికి ఇక్కడి ఆర్డీవో ఎనిమిదేళ్ల కింద రైతులకు నోటీసులు పంపారు. అయితే రైతులెవరూ పెద్దగా స్పందించకపోవడంతో ఆర్డీవో స్థాయిలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ భూములను స్వాధీనం చేసుకునే పనిని వేగవంతం చేశారు. రైతులను పంపించివేయడానికి కొందరికి ఎంతో కొంత సొమ్ము ముట్టజెప్పడం, మరికొందరిని బెదిరించడం ద్వారా తమ దారికి తెచ్చుకున్నారు. ఇలా దాదాపు వంద ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల చుట్టూ కంచె వేసి.. ఓ గెస్ట్‌హౌస్ కూడా నిర్మించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్, ఆయన కంపెనీల డైరెక్టర్లు అప్పుడప్పుడు ఆ గెస్ట్‌హౌస్‌కు వచ్చి వెళుతుంటారని తెలిసింది.
మిగిలింది కొంత భూమే!
317 ఎకరాల భూములను 62 మంది రైతులకు అసైన్ చేయగా.. దాదాపు 95 శాతం మంది తమ భూములను కొన్నేళ్ల కిందే అమ్మేసుకున్నారు. ఇప్పుడు కేవలం 30 ఎకరాల వరకు భూమి మాత్రమే అసైన్డ్ రైతుల ఆధీనంలో ఉంది. మిగతా భూమిలో 100 ఎకరాలకుపైగా గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఆధీనంలోకి వెళ్లిపోగా.. మరికొంత భూమి రైతుల నుంచి కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో ఉంది. ఇలా రైతుల నుంచి కొనుగోలు చేసినవారి వద్ద ఉన్న భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా వారిలో చాలా మంది ఎంతోకొంత సొమ్ము తీసుకుని అప్పగించేశారు. ఇలా అప్పగించేసినవారిలో ఒక ప్రముఖ సినీ హాస్యనటుడు కూడా ఉన్నారు. ఈ హాస్యనటుడు ఘాంసిమియాగూడలో 19 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల వద్ద కొనుగోలు చేశారు. కానీ చివరికి కొంత డబ్బు తీసుకుని గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు ఇచ్చేశారు. మరోవైపు ఈ సర్వే నంబర్‌లోని కొన్ని భూములను ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుని.. ఐదెకరాల స్థలంలో గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కానీ ఆ భూములను కొనుగోలు చేసినవారు కోర్టుకు వెళ్లడంతో లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వలేకపోయారు.
హైకోర్టును ఆశ్రయించాం..
‘‘ఘాంసిమియాగూడలోని సర్వే నంబర్4లో ఉన్న భూములు ప్రభుత్వ భూములుగానే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఈ వివాదంపై మార్చిలో హైకోర్టులో పిల్ వేయడం జరిగింది..’’
– శంషాబాద్ తహసీల్దార్ సురేశ్‌కుమార్