భూపంపిణీ ప్రశ్నార్థకం! | lands questionabal! | Sakshi
Sakshi News home page

భూపంపిణీ ప్రశ్నార్థకం!

Published Fri, Dec 26 2014 1:42 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

భూపంపిణీ ప్రశ్నార్థకం! - Sakshi

భూపంపిణీ ప్రశ్నార్థకం!

జమ్మికుంట మండలం పాతర్లపల్లిలో ప్రైవేట్ పట్టాదారుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి ఇది. మొత్తం 15 ఎకరాలు కొనుగోలు చేశారు. పాతర్లపల్లికి చెందిన కోడెం రాజమణి, దుబాసి రజిత, రాం రాధ, రాం తిరుమల, రాం సమ్మక్కలకు తలా మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. పథకం ప్రారంభించిన ఆగస్టు 15న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా రాజమణి, రజితకు పట్టాలు అందజేశారు. రాధ, తిరుమల, సమ్మక్కలకు కరీంనగర్‌లో మంత్రి ఈటెల రాజేందర్ అదేరోజున పట్టాలు అందించారు. ఇచ్చిన ఐదు నిమిషాలకే అధికారులు వీరి వద్దనుంచి పట్టాలు తిరిగి తీసుకుని ఇప్పటివరకు ఇవ్వలేదు. హద్దులు చూపించలేదు సరికదా... ప్రైవేట్ పట్టాదారులకు సైతం భూమి కొనుగోలు చేసిన డబ్బులు ఇప్పటివరకు అప్పగించలేదు.
 
 రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితులకు భూపంపిణీ పథకం ప్రశ్నార్థకంగా మారింది. దళిత కుటుంబానికి మూడెకరాల చొప్పున భూమి పంచేందుకు ప్రైవేట్ భూములు కొనుగోలు చేసిన సర్కారు భూ యజమానులకు పూర్తిగా డబ్బులు చెల్లించడం లేదు. పట్టాలిచ్చిన దళితులకు ఆ భూమి హద్దులేవో చూపించడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అటు భూ యజమానులు, ఇటు దళితులు నానాపాట్లు పడుతున్నారు. ఇరువురి మధ్య సదరు భూమి సాగుకు నోచుకోని పరిస్థితి నెలకొంది. పథకం ప్రారంభంలో 216 మంది దళితులకు పత్రాలను అందించినప్పటికీ అందులో సగం మందికే రిజిస్ట్రేషన్ చేయగా, మిగిలిన వారికి మొండిచేయి చూపింది.
 - ముకరంపుర    
 
 ముకరంపుర:
 ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల కిరికిరి దాటి ప్రైవేట్ భూములు కొనుగోలు చేయడానికి పెద్ద తతంగమే ఉండడంతో భూ పంపిణీకి ఆదిలోనే అడ్డంకులు తప్పడం లేదు. సాగు భూములనే కొనుగోలు చేయాలనే నిబంధనతో రైతులతో బేరసారాలు చేపట్టినా ఫలితమివ్వడం లేదు. ఒకదశలో.. సాగు భూములు అమ్మదలచుకుంటే వెంటనే సంప్రదించండి.. అంటూ ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఒకవేళ ఎవరైనా భూమి అమ్మకానికి ముందుకువస్తే డబ్బుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లాలో ఆగస్టు 15న మొదటి విడత భూ పంపిణీకి ఎంపిక చేసిన 22మంది లబ్దిదారుల కోసం కొనుగోలు చేసిన 65 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆయా ఆర్డీవోలకు ఇచ్చిన రూ.3.16 కోట్ల నిధులను ఇంతవరకూ భూ యజమానులకు చెల్లించలేదు. భూముల అమ్మకంపై బేరసారాలు కుదరకనే పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు.
 
 మార్చిలోగా ఆరువేల ఎకరాలు..
 జిల్లాలో మార్చి నెలాఖరులోగా ఆరువేల ఎకరాల భూమిని పంపిణీ చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది జనవరి, మార్చిలోగా రెండు దశల్లో పంపిణీ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. సర్కారు భూములు లేకపోగా ప్రైవేట్ భూములను ఎకరానికి రూ.2లక్షల నుంచి రూ.7లక్షల లోపు ధరలకు కొనుగోలు చేయాలని సర్కారు ఆదేశాలున్నాయి. కానీ ఈ ధరలకు సాగుభూములు విక్రయించేందుకు రైతులు ముందుకు రావడం లేదు. ఎంపిక చేసిన ఆయా గ్రామాల్లో ఐదేళ్ల పాటు సాగు చేసినభూమినే కొనుగోలు చేసి లబ్దిదారుడికి పంచాలని నిర్ణయించారు.
 
  సంబంధిత భూమికి జిల్లా యంత్రాంగమే ధర నిర్ణయిస్తుంది. భూ విక్రేతల వద్ద 15 రకాల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటున్నారు. పట్టాదారు పాసుపుస్తకం, టైటిల్‌డీడ్, పదమూడేళ్ల ఈసీ, ఆయా బ్యాంకుల నుంచి ఎన్‌వోసీ, ఇలా అన్నీ తెచ్చిన తర్వాత భూగర్భ జలశాఖ అధికారులు ఆ భూముల్లో నీటి లభ్యత ఉందా.. లేదా.. అని తేల్చిన తర్వాతే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చిలోపు ఆరువేల ఎకరాల భూ పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది.
 
 హడావుడిగా ఆరంభం..
 జిల్లాలో 1.77 లక్షల ఎస్సీ కుటుంబాలుండగా, అసలు భూమిలేని కుటుంబాలు 1.50 లక్షల ఉన్నాయి. పథకం ఆరంభానికి ముందు మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి భూపంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు లభ్యం కాకపోవడంతో నియోజకవర్గంలో ఒక గ్రామానికి పరిమితం చేశారు.
 
 చివరకు పంద్రాగస్టున పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఎక్కడ పట్టా భూములు లభ్యమై బేరం కుదిరిందో అక్కడే లబ్దిదారులను ఎంపిక చేశారు. 12 నియోజకవర్గాల్లో 16 గ్రామాలను ఎంపిక చేయగా, 122 మంది లబ్దిదారులను గుర్తించి, 307.57 ఎకరాల భూ పంపిణీ పత్రాలు అందజేశారు. అందుకోసం రూ.8,42,69,741 నిధులు వెచ్చించారు. ఆ తర్వాత మరో 94 మంది లబ్దిదారులను గుర్తించారు. మొత్తంగా ఇప్పటివరకు 558 ఎకరాల 29 గుంటలను గుర్తించి, 216 మందికి భూపంపిణీ పత్రాలు జారీ చేశారు. 339.42 ఎకరాల ప్రైవేట్ భూమిని రూ.12.72 కోట్లతో కొనుగోలు చేసి 163 మంది లబ్దిదారులకు పత్రాలు అందజేశారు. 119.28 ఎకరాల ప్రభుత్వ భూమిని 53 కుటుంబాలకు పంపిణీ చేశారు.
 
 రిజిస్ట్రేషన్ చేసింది కొంతే..
 మొదట్లో ఆర్భాటంగా పత్రాలిచ్చినప్పటికీ.. కొనుగోలు చేయాల్సిన భూముల్లో నీటి లభ్యత లేకపోవడం, బేరం కుదరకపోవడం కారణంగా భూముల పంపిణీ సగం వరకు పెండింగ్‌లోనే ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూమికి సంబంధించి 119.28 ఎకరాల ప్రభుత్వ భూమిని 53 మంది లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేశారు. 119.36 ఎకరాల ప్రైవేట్ భూమిని 49 మంది లబ్దిదారులకు రూ.4.99 కోట్లు వెచ్చించి రిజిస్ట్రేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 239.24 ఎకరాల ఎకరాల భూమిని 102 మంది లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
 
 పట్టాలు ఇచ్చారు.. వెంటనే తీసుకున్నారు
 పంద్రాగస్టు రోజున జమ్మికుంట మండలం పెద్దపాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రాజమణి, దుబాసి రజితలను హైదరాబాద్‌కు పిలిపించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భూ పంపిణీ పట్టాలను అందజేశారు. అదే గ్రామానికే చెందిన రాం రాధ, రాం తిరుమల, రాం సమ్మక్కలకు మూడు ఎకరాల చొప్పున పట్టాలను కరీంనగర్‌లో మంత్రి ఈటెల రాజేందర్ అందజేశారు. కానీ మంత్రి ఇచ్చిన ఐదు నిమిషాలకే వీరివద్ద నుంచి తిరిగి పట్టాలను అధికారులు తీసుకున్నారని లబ్దిదారులు చెబుతున్నారు. భూముల్లో బోర్లు వేయిస్తామని, విత్తనాలు, ఎరువులు, మందులు ఇస్తామని.. ఇంకా ఏవేవో చెప్పారు. కాని ఇప్పటి వరకు భూములను అప్పగించలేదని లబ్దిదారులు వాపోతున్నారు.
 
 లక్షన్నర నష్టం వచ్చింది...
 నాకున్న ఆరెకరాల భూమిలో నాలుగెకరాల పొలం, రెండెకరాల్లో పత్తి పంటను వేశాను. ఆగస్టులోనే డబ్బులు వస్తాయంటే ప్రభుత్వానికి భూమిని అమ్మాను. అందులో వేసిన పంటలు లబ్దిదారులకే చెందుతాయంటే ఇక నేను పంట గురించి పట్టించుకోలేదు. దీంతో వరి, పత్తిపంటలపై దాదాపు లక్షన్నర నష్టపోయాను.  
 - భీనవేన కుమార్, సిరిసేడు, జమ్మికుంట
 
 పంట పోయింది..
 పైసలూ రాలేదు
 నా భూమిని ప్రభుత్వం కొనుగోలు చేస్తానంటే సరే అన్నాను. ఎకరానికి 5.5లక్షల చొప్పున ఇచ్చేందుకు ఒప్పుకున్నాను. ఆగస్టు నెలలోనే డబ్బులు వస్తాయని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నయాపైసా రాలేదు. ఆగస్టులో వేసిన పంట లబ్దిదారులకే చెందుతుందని చెప్పటంతో పంటపై దృష్టి సాధించలేదు. దీంతో పంటను నష్టపోయాను. ఇక్కడి భూమి అమ్మడంతో వేరోచోట భూమి కొనుగోలుకు రెండు లక్షలు బయానా ఇచ్చాను. అక్కడ సమయానికి డబ్బులు చెల్లించలేకపోయాను. బయాన ఇచ్చిన రెండు లక్షలు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
 - అబ్బిడి మల్లారెడ్డి, పెద్దపాతర్లపల్లి, జమ్మికుంట మండలం
 
 ఇంటి కోసం
 భూమి అమ్మాను
 భూమి అమ్మితే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఇల్లు నిర్మాణాన్ని మొదలుపెట్టాను. సమయానికి డబ్బులు రాకపోవటంతో అప్పులు తెచ్చి ఇంటిని నిర్మించాను. రుణమాఫీ కోసం 30వేలు బ్యాంక్‌లో కట్టాను. అటు రుణమాఫీ వర్తించలేదు. ఇటు సమయానికి డబ్బులు రాలేదు.
 -మహ్మద్ షహాన : సిరిసేడు,
 జమ్మికుంట మండలం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement