మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం
నిర్మల్(మామడ) : మామడ మండలంలోని బూరుగుపల్లి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేష్ (24), దీప్‌చంద్ (20), ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భరత్ (20) మృతి చెందారు. వీరు ఫరిదాబాద్ నుంచి కర్నూల్‌కు లారీలో కొత్త ద్విచక్రవాహనాలను తీసుకెళ్తున్నారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న లారీ బూరుగుపల్లి సమీపంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీ రోడ్డు పక్కనున్న రోలింగ్‌కు తగిలింది. బోల్తా పడిన తర్వాత దాదాపు వంద మీటర్ల వరకు దూసుకెళ్లింది. దీంతో లారీ డ్రైవర్ ముకేష్‌తోపాటు మరో ఇద్దరు లారీలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. ఖానాపూర్ సీఐ నరేష్‌కుమార్, లక్ష్మణచాంద ఎస్సై నవీన్‌కుమార్, మామడ ఏఎస్సై సిద్ధేశ్వర్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను నిర్మల్‌కు తరలించారు.