లాయర్ల ఆందోళనతో స్తంభించిన హైకోర్టు
విభజన డిమాండ్‌తో టీ లాయర్ల జేఏసీ ‘చలో హైకోర్టు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) మంగళవారం చేపట్టిన ‘చలో హైకోర్టు’ ఆందోళనతో హైకోర్టు స్తంభించింది. హైకోర్టును వెంటనే విభజించాలని, అప్పటివరకూ న్యాయ వ్యవస్థలో ఎటువంటి పోస్టులను భర్తీ చేయొద్దని డిమాండ్‌చేస్తూ లాయర్లు విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు, క్రిమినల్, సివిల్, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టులకు చెందిన న్యాయవాదులే కాక తెలంగాణ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌ల అధ్యక్ష, కార్యదర్శులు కొండారెడ్డి, విజయ్‌కుమార్, జగత్‌పాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోర్టు విధుల ప్రారంభానికి ముందే హైకోర్టుకు చేరుకున్న న్యాయవాదులు అన్ని కోర్టు హాళ్లకు వచ్చి విధుల బహిష్కరణకు సహకరించాలని సాటి న్యాయవాదులను, న్యాయమూర్తులను కోరారు. దీంతో న్యాయమూర్తులు తమ చాంబర్లకు వెళ్లిపోయారు.
ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రం న్యాయవాదుల విధుల బహిష్కరణ విజ్ఞప్తిని మన్నించేందుకు తొలుత నిరాకరించారు. అయితే విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించాలని టీ న్యాయవాదులు కోరడంతో వెనక్కి తగ్గిన సీజే, పావు గంట తరువాత తిరిగి కోర్టు హాలులోకి వస్తామని, న్యాయవాదులెవరూ లేకపోతే చాంబర్లకు వెళ్లిపోతామని స్పష్టం చేశారు.
దీంతో కోర్టులో ఉన్న న్యాయవాదులు బయటకు వెళ్లిపోవడంతో విధుల బహిష్కరణ విజయవంతమైనట్లయింది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బార్ కౌన్సిల్ నుంచి మదీనా చౌరస్తా వరకు న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీ బార్ కౌన్సిల్ బోర్డు మీద ఉన్న ఏపీ అక్షరాలను తెలంగాణ న్యాయవాదులు తొలగించి ధ్వంసం చేశారు.
ఆ తరువాత తెలంగాణ ఏజీ కె.రామకృష్ణారెడ్డి, అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఐకాస కన్వీనర్ ఎం.రాజేందర్‌రెడ్డి, కో కన్వీనర్ గండ్ర మోహనరావు, న్యాయవాదులు సత్యంరెడ్డి, వి.రఘునాథ్, లక్ష్మణ్‌కుమార్‌లు మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తాను కలిసి బుధవారం కూడా విధుల బహిష్కరణ కొనసాగుతుందని తొలుత చెప్పారు. అయితే హైకోర్టు విభజనపై వినతిపత్రం ఇవ్వాలని, దీనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపి, వారితో చర్చిస్తామని సీజే చెప్పినట్లు ఐకాస ప్రతినిధులు మీడియాకు చెప్పారు. అయితే సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని తెలంగాణ లాయర్లు విరమించుకున్నట్లు సీఎం కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.