
సాక్షి, హైదరాబాద్: కాలయాపన లేకుండా, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల వైద్యసేవలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వైద్య సేవలకు అవసరమైన అనుమతుల విషయంలో కాలయాపన లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ సేవల ఆస్పత్రుల ఎంపానెల్‌మెంట్ ప్రక్రియ వేగంగా, సులభంగా అయ్యేట్లు చూడాలని ఆదేశించారు. కొత్తగా ఆంకాలజీ విభాగంలో గొంతు క్యాన్సర్, ట్యూమర్ చికిత్సలకోసం ప్రత్యేకంగా కోడ్‌ని కేటాయించి చికిత్స అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాత జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. వరంగల్‌లో బుధవారం వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర సరిహద్దుల్లో గ్రామాల ప్రజలకు పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, వైద్య సంచాలకురాలు లలితకుమారి, ఆయుష్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో మనోహర్, ఈహెచ్‌ఎస్–జేహెచ్‌ఎస్ సీఈవో కె.పద్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment