సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు.
వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్‌ఏ), హాల్‌క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్‌మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్‌ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్‌పేట్ సెక్షన్‌ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు.
అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు
ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, బేగంపేట్, ప్రకాశ్‌నగర్, రసూల్‌పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్‌జీఆర్‌ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్‌జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్‌కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్‌కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్‌ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్‌నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్‌డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment