ఇటీవల హైటెక్‌సిటీ రూట్లో మెట్రోపనులను పరిశీలిస్తున్న హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: అమీర్‌పేట్–హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో రైలు పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశాలు దరిదాపుల్లోనూ కనిపించడంలేదు. ఇటీవల ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో రైలును లాంఛనంగా ప్రారంభించిన గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్..డిసెంబర్ నాటికి హైటెక్ సిటీ కారిడార్‌ను పూర్తిచేసి మెట్రో రైళ్లనుసిటీజన్లకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులకు సూచించారు. అయితే ఈ మార్గంలో మెట్రో పనుల పూ ర్తికి పలు బాలారిష్టాలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా రివర్సల్ ట్రాక్ ఏర్పాటు పనులు ఆలస్యమౌతుండడమే దీనికి కారణమని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితితో ఈ రూట్లో మెట్రో రాకకోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది ఐటీ, బీపీఓ, కెపిఓ రంగాల ఉద్యోగులకు మరో ఆరునెలలపాటు నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది.
రివర్సల్‌ట్రాక్ పనులే కీలకం...
నాగోల్–హైటెక్‌సిటీ(28 కి.మీ)మెట్రో మార్గాన్ని ప్రభుత్వం 1.5 కి.మీ మేర పెంచి రాయదుర్గం వరకు పొడిగించిన విషయం విదితమే. రాయదుర్గం ప్రాంతంలో 15 ఎకరాల సువిశాల స్థలంలో టెర్మినల్ స్టేషన్‌తోపాటు మెట్రోమాల్స్, ప్రజోపయోగ స్థలాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే మెట్రో మార్గాన్ని ఉన్నఫలంగా పొడిగించడం..హైటెక్‌సిటీ–రాయదుర్గం రూట్లో పనులు సకాలంలో మొదలుకాకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు హైటెక్‌సిటీ నుంచి శిల్పారామం వరకు అరకిలోమీటరు మేర మెట్రో పిల్లర్లను పొడిగించి అక్కడివరకు మెట్రోట్రాక్ ఏర్పాటుచేసి అక్కడి నుంచి రివర్సల్‌ట్రాక్(మెట్రో రైళ్లు మలుపుతిరిగే ట్రాక్)ఏర్పాటుచేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ మార్గంలో ఎస్‌ఆర్‌డీపీ పనుల కారణంగా మెట్రో పిల్లర్లు ఏర్పాటుచేయడం కష్టసాధ్యమని నిపుణులు స్పష్టంచేయడంతో రివర్సల్‌ట్రాక్ ఏ ర్పాటు పనులు మరింత ఆలస్యమయ్యాయి. దీం తో ఈ రూట్లో మెట్రో మరింత ఆలస్యమౌతోంది.
రివర్సల్ ట్రాక్‌కు ప్రత్యామ్నాయమిదే..
హైటెక్‌సిటీకి సకాలంలో మెట్రోను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎంఆర్,ఎల్‌అండ్‌టీ అధికారులు ఆగమేఘాల మీద పనులు ప్రారంభించారు. రివర్సల్ ట్రాక్ ఏర్పాటు చేస్తేనే అమీర్‌పేట్–హైటెక్‌సిటీ(10 కి.మీ)మార్గంలో ప్రతి ఐదు నిమిషాలకోరైలును నడిపే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా హైటెక్‌సిటీ నుంచి 500 మీటర్ల దూరంలోని లెమన్‌ట్రీ హోటల్ వరకు 7 మెట్రో పిల్లర్లను ఏర్పాటుచేసి మెట్రో ట్రాక్‌ను పొడిగించనున్నారు. అక్కడి నుంచి రివర్సల్ ట్రాక్‌ను ఏర్పాటుచేసి మెట్రో రాకపోకలకు మార్గం సుగమం చేయనున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైనప్పటికీ వీటిని పూర్తిచేసేందుకు వచ్చే ఏడాది మార్చి వరకు సమయం పట్టనున్నట్లు స్పష్టంచేశారు.
ఎల్బీనగర్–మియాపూర్ మెట్రో ఫుల్..జోష్
ఎల్బీనగర్–మియాపూర్(29 కి.మీ)మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో మెట్రోలో రద్దీ క్రమంగా పెరుగుతూనే ఉంది. సాధారణ రోజుల్లో రద్దీ 1.30 లక్షలు కాగా..సెలవురోజుల్లో రద్దీ 1.50 లక్షలనుంచి 1.60 లక్షలవరకు ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇక నాగోల్–అమీర్‌పేట్ మార్గంలో నిత్యం 50–60 వేల మంది రాకపోకలు సాగిస్తుండగా..సెలవురోజుల్లో రద్దీ 80–90 వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో త్వరలో రద్దీ రెండు లక్షల మార్కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment