జహీరాబాద్ (మెదక్): బోధనపై అమితాసక్తి ఉన్న ఓ లెక్చరర్... 150 గంటల పాటు నిరంతరాయంగా బోధించేందుకు సిద్ధమయ్యారు. గిన్నిస్ రికార్డుల పుస్తకంలో తన పేరును లిఖించుకునేందుకు సంసిద్ధులయ్యారు. మెదక్ జిల్లా జహీరాబాద్‌లోని వశిష్ట డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా పని చేస్తున్న బి.మారుతిరావు... అదే కళాశాలలో సోమవారం (ఈనెల 9వ తేదీ) ఉదయం 7.30 గంటలకు ప్రారంభించి, 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు లెక్చర్లు ఇవ్వనున్నారు. 150 గంటల పాటు సుదీర్ఘంగా ట్యాక్సేషన్, అకౌంట్స్, కాస్ట్ అక్కౌంట్స్‌పై సెమినార్ నిర్వహించనున్నారు. ఇలా సుదీర్ఘ సమయం పాటు బోధన మారుతిరావుకు కొత్త కాదు. 2006లో ఆయన తొలిసారిగా 12 గంటల పాటు ఇలాంటి ప్రయత్నం చేశారు.
నాటి నుంచి ఏటా బోధన సమయాన్ని పెంచుకుంటూ వస్తున్నారు. 2013లో 75 గంటల పాటు సెమినార్ నిర్వహించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. సోమవారం నుంచి నిర్వహించనున్న 150 గంటల సెమినార్‌కు బీకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు హాజరు కానున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. భోజనం సమయంలో అరగంట, అల్పాహారం సమయంలో పావుగంట మాత్రమే విరామం ఉంటుందని... సెమినార్‌లో చెప్పే అంశాలను విని, ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలిచ్చే విద్యార్థికి బహుమతి ప్రదానం చేస్తామని లెక్చరర్ మారుతిరావు తెలిపారు.