ప్రభుత్వం మెడలు వంచుదాం
ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు పది వామపక్షాల పిలుపు
భరోసా కల్పించేందుకు 5 నుంచి బస్సుయాత్రలు
11న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: పంటలు దెబ్బతినడంతో నిరాశా, నిస్పృహలకులోైనె ఆత్మహత్యలకు పాల్పడవద్దని పది వామపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం మెడలు వంచి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని ఆదుకునేలా చేస్తామని పేర్కొన్నాయి. రైతులకు ఆర్థిక భద్రతను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రైవేటు రుణాలపై రెండేళ ్లపాటు మారటోరియం ప్రకటించాలని, వ్యాపారుల అక్రమ వడ్డీపై నియంత్రణ విధించాలని కోరాయి. ఈ నెల 5 నుంచి 10వ తేదీ మధ్య రెండు బృందాలుగా బస్సుజాతాలను నిర్వహించి.. రైతుల్లో మనోధైర్యాన్ని నింపేం దుకు కృషి చేయనున్నట్లు ప్రకటించాయి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో అనంతరం 11న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని తెలిపాయి. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘రైతు భరోసా యాత్ర’, ధర్నా పోస్టర్‌ను పది వామపక్షాల నేతలు విడుదల చేశారు.
రెండు బృందాలుగా తెలంగాణ ఉత్తర, దక్షిణ జిల్లాల్లో చేపట్టనున్న బస్సుయాత్ర మార్గాన్ని, గత ఆర్నెల్లలో తొమ్మిది జిల్లాల్లో ఆత్మహత్యకు పాల్పడిన 565 మంది రైతుల జాబితాను మీడియాకు వెల్లడించారు. ఈ జాబితా ప్రకారం.. గత ఆర్నెల్లలో మెదక్ జిల్లాలో 102 మంది, కరీంనగర్‌లో 81, ఆదిలాబాద్‌లో 80, మహబూబ్‌నగర్‌లో 73, నల్లగొండలో 69, వరంగల్‌లో 66, రంగారెడ్డిలో 41, నిజామాబాద్‌లో 40, ఖమ్మం జిల్లాలో 23 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వామపక్షాల బస్సుయాత్ర మొదటి బృందం 5వ తేదీన మెదక్ జిల్లా గజ్వేల్‌లో ప్రారంభమై సిద్ధిపేట వరకు, 6న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి 7వ తేదీన ఆదిలాబాద్ జిల్లా లక్శెట్టిపేట వరకు, 8న ఆదిలాబాద్ జిల్లా జిన్నారంలో మొదలై నిర్మల్ వరకు. 9న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మెదక్ జిల్లా నారాయణ్‌ఖే డ్ వరకు, 10న రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో ప్రారంభమై చేవెళ్లలో ముగుస్తుంది. ఇక రెండో బృందం బస్సుయాత్ర 5న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలై కందుకూరు వరకు, 6న మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో ప్రారంభమై నల్లగొండ జిల్లాలో ముగుస్తుంది. 8న నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి కోదాడ వరకు, 9న ఖమ్మంలో మొదలై గార్లలో ముగుస్తుంది. 10న వరంగల్‌జిల్లా డోర్నకల్‌లో మొదలై జనగామలో ముగుస్తుంది. 11వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా, నిరసన సభను నిర్వహిస్తారు.
సర్కారు విఫలం: చాడ
ఆత్మహత్యల నివారణకు నిర్దిష్టచర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తమయాత్రలో ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను లోతుగా విశ్లేషిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల అంశంపై వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేసి సహాయచర్యలను ప్రకటించాలని సారంపల్లి మల్లారెడ్డి (సీపీఎం) డిమాండ్‌చేశారు. రైతాంగానికి కనీస భరోసా ఇవ్వకుండా సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. ప్రభుత్వం మెడలు వంచైనా తగిన చర్యలు తీసుకునేలా చేస్తామని వేములపల్లి వెంకటరామయ్య (న్యూడెమోక్రసీ) అన్నారు. వ్యవసాయ రంగ పరిరక్షణ రాష్ర్ట బాధ్యతగా రాజ్యాంగంలో పేర్కొన్నారని, ఈ కర్తవ్యాన్ని నిర్వహించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని పశ్యపద్మ (రైతు సంఘం) విమర్శించారు. ఈ భేటీలో మూర్తి (లిబరేషన్), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ-సీ), తాండ్రకుమార్ (ఎంపీసీఐ-యూ), వీరయ్య (సీపీఐ-ఎంఎల్) పాల్గొన్నారు.