‘ప్రణాళిక’ సరే..పైసలేవి? | Less Grants Released For Works To Adilabad Village People | Sakshi
Sakshi News home page

‘ప్రణాళిక’ సరే..పైసలేవి?

Published Sat, Sep 14 2019 12:36 PM | Last Updated on Sat, Sep 14 2019 12:36 PM

Less Grants Released For Works To Adilabad Village People - Sakshi

బజార్‌హత్నూర్‌ మండలం భూతాయి(బి) గ్రామంలో రోడ్లపై గుంతలు పూడుస్తున్న దృశ్యం

బజార్‌హత్నూర్‌ మండలం భూతాయి(బి) గ్రామ జనాభా 1200. ఈ లెక్కన పంచాయతీ కి కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి ఏడాదికి రూ.19. 34 లక్షలు రావాలి. మూడు నెలకోసారి నిధులు విడుదల చేసినా రూ.4.83 లక్షలు కేటాయించాలి. అయితే ఈ గ్రామానికి ప్రస్తుతం రూ.1.62 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నెల 6న గ్రామంలో ప్రారంభించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అనేక సమస్యలు గుర్తించారు.. పిచ్చిమొక్కలు తొలగించడం, గుంతలు మొరంతో పూడ్చడం, డ్రెయినేజీలు శుభ్రం చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలకు మాత్రమే ప్రస్తుతం మంజూరైన నిధులు సరిపోయేలా ఉన్నాయి. మరి గుర్తించినటువంటి పెద్ద పనుల పరిస్థితి ఏమిటో?. 

సాక్షి, ఆదిలాబాద్‌ : జనాభాలో అత్యధిక ప్రజలు నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే. గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి. తలసరి ఒకరికి రూ.806 చొప్పున కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. దానికి అదనంగా తలసరి ఒకరికి రూ.806 చొప్పున జోడించి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ లెక్కన రెండు కలిపి తలసరి ఒకరికి రూ.1612 కేటాయిస్తారు. జనాభా ఆధారంగా ఈ నిధులను జీపీలకు మంజూరు చేస్తారు. జిల్లాలోని గ్రామీణ జనాభా ప్రకారం ఈ రెండు కలిపి ఏడాదికి రూ.87.24 కోట్లు జిల్లాకు కేటాయించాలి. ఈ నిధుల వంతుల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి మంజూరవుతాయి.

ఈ లెక్కన జిల్లాకు రూ.21.81 కోట్లు మొదటి విడత మంజూరు కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తామని చెప్పింది. ఇటీవల జిల్లాకు ఈ రెండు నిధులు కలిపి రూ.8.96 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాలేదు. అరకొరగా వచ్చిన నిధులతో ప్రస్తుతం చిన్నపాటి పనులే చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన గ్రామ కార్యాచరణలో భాగంగా ఈ 30 రోజుల్లో గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చదనం, హరితహారం వంటి పనులు వేగంగా సాగుతున్నాయి. మిగతా సమస్యలను గుర్తిస్తున్నారు. 

వాటి పరిష్కారం ఎలా?
జీపీలకు మంజూరైన ఈ నిధుల్లో పారిశుధ్యం కోసం 15 శాతం, హరితహారానికి 10 శాతం, విద్యుత్‌ అవసరాలకు 10 శాతం, కార్యాలయ నిర్వహణకు 5 శాతం, ఇతర ఖర్చులకు 10 శాతం నిధులను కేటాయించినట్లు క్షేత్రస్థాయిలో అధికారులు పేర్కొంటున్నారు. మిగతా 50 శాతం నిధులను అభివృద్ధి పనులకు కేటాయించాలి. ప్రస్తుతం గ్రామాల్లో గుర్తించిన సమస్యలకు సంబంధించి ఏటా.. ఐదు సంవత్సరాలకు సంబంధించి పంచవర్ష ప్రణాళికలు రూపొందించాలి. వార్షిక ప్రణాళికలో ఖర్చు చేయగా మిగిలిన నిధులను వచ్చే వార్షిక ప్రణాళికకు బదిలి చేయాలి. అయితే ప్రస్తుతం కార్యాచరణలో భాగంగా ప్రధానంగా కొత్త గ్రామపంచాయతీలకు సొంత భవనాలు లేవు. వాటి కోసం స్థలాలను గుర్తిస్తున్నారు. ఏదైనా పంచాయతీలో శ్మశానవాటిక లేకపోతే దానికోసం స్థలాలను గుర్తిస్తున్నారు. చెత్త తరలింపు కోసం డంపింగ్‌ యార్డు స్థలాన్ని కూడా గుర్తిస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు భవనం లేకపోతే దానికి కూడా స్థలం గుర్తిస్తున్నారు. ఇలా పలు సమస్యలకు సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారు. అయితే 50 శాతం నిధులతో ఈ పనులను చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులకు సంబంధించి ఈజీఎస్‌లో చేపడుతున్నారు. తద్వారా వాటికి ఇక ఆ నిధులే శరణ్యం. కొత్త పంచాయతీలకు భవనం కోసం నిధులు పీఆర్‌ ద్వారా కేటాయిస్తారా?.. ఎలా అన్నది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. ఇక నర్సరీలకు స్థలం కేటాయింపు విషయంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదిలా ఉంటే హరితహారంలో భాగంగా పంచాయతీలో మొక్కలు నాటుతున్నా వాటి సంరక్షణ కోసం ట్రీగార్డులు కేటాయించకపోగా ముళ్ల కంచెలనే ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం ఏవిధంగా సబబన్న ప్రశ్న తలెత్తుతోంది. పలు గ్రామాల్లో ప్రస్తుతం ముళ్ల కంచెలు లభించడం లేదు. దీంతో గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు దాతల వైపు చూస్తున్నారు. అయితే ప్రతీచోట దాతల ఉదారత కనిపించడం లేదు. మరోపక్క విద్యుత్‌ సమస్యలు ఈ కార్యాచరణలో పరిష్కారానికి నోచుకుంటున్నాయి. అయితే విద్యుత్‌శాఖ ద్వారా పవర్‌ వీక్‌ నిర్వహించినప్పుడు పూర్తిసా ్థయి సమస్యలు పరిష్కారం అవుతాయన్న భావన గ్రామపంచాయతీల్లో నెలకొంది.

మండలానికో ప్రత్యేకాధికారి
ముపై రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో మండలానికో ప్రత్యేక అధికారిని కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ నియమించారు. కలెక్టర్‌ కూడా మావల మండలాన్ని ఎంచుకోవడం గమనార్హం. తద్వారా మిగతా అధికారులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు. జేసీ సంధ్యారాణి, ఇతర జిల్లా అధికారులు కూడా ఒక్కో మండలానికి ప్రత్యేక అధికారులుగా ఈ కార్యాచరణలో భాగస్వాములు అయ్యారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement