
ఆకలికి అన్నం, వేదనకు ఔషధం ఎలాగో... శూన్యంతో నిండిన మెదడుకు పుస్తకం కూడా అలాగే. ఆలోచనలను పదునెక్కించేందుకు, సృజనాత్మకతను పెంచుకొనేందుకు మెదడుకు మేత అవసరం. అది పుస్తకం మాత్రమే భర్తీ చేయగలుగుతుంది. అది నిశ్శబ్దంగా జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది. ప్రతి వ్యక్తిని ఒక పరిపూర్ణమైనమానవుడిగా తీర్చుదిద్దుతుంది. కానీ అర్ధాకలితో పస్తులున్నట్లుగానే ఎంతోమంది చిన్నారులు పుస్తకాల కొరత కారణంగా జ్ఞానాన్ని సముపార్జించలేకపోతున్నారు. పిల్లలు ఈ ప్రతికూలతను అధిగమించేందుకు హైదరాబాద్ కేంద్రంగా శ్రీకారం చుట్టింది ‘ఫుడ్ ఫర్ థాట్’ ఫౌండేషన్. ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో 200 పుస్తకాలతో సుమారు 300కు పైగా లైబ్రరీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా 20కి పైగా రాష్ట్రాల్లో ‘ఫుడ్ ఫర్ థాట్’ లైబ్రరీలు ఆకలిగొన్నమస్తిష్కాలకు పుస్తక భోజనాన్ని అందజేస్తున్నాయి.
చదువు–చదివించు..
‘పుస్తకం కొందరికే అందుబాటులో ఉంటుంది. అదిఅందరి దరికీ చేరాలంటే ఏం చేయాలి...’ శ్రీనివాస్‌రావు, షిఫాలీరావు, మాధవీ శర్మ ఈ ముగ్గురినీ వేధించిన ప్రశ్న ఇది. ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని ఒకటికి నాలుగుసార్లు చదవగలడు. కానీ అదే పుస్తకాన్ని కొంతమందికి అందజేస్తే.. ఆ కొందరు మరి కొందరికి అందజేస్తే జ్ఞానం అందిరికీ చేరువవుతుంది. ఈ లక్ష్యంతోనే 2015లో ‘ఫుడ్ ఫర్ థాట్’ను ఏర్పాటు చేశారు. మొదట తాము చదివిన పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేశారు. నగరంలోని ఆర్‌కే నగర్, హఫీజ్‌పేట్, అంజయ్యనగర్ బస్తీ, సిద్దిఖ్‌నగర్ తదతర అనేకప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలయాలను ఏర్పాటు చేశారు. మొత్తం 200 పుస్తకాలు. నీతి నైతిక విలువను బోధించే కథల పుస్తకాలు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు జనరల్ నాలెడ్జ్ బుక్స్, ఎన్‌సైక్లోపీడియాలు ఉంటాయి. మాతృభాషలో 50 పుస్తకాలు ఉంటే మిగతా 150 పుస్తకాలు ఇంగ్లి్లష్‌లో ఉంటాయి.
స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థికి గ్రంథాలయం నుంచి గుర్తింపు కార్డు ఉంటుంది. ఇలా కొద్ది స్కూళ్లతో ప్రారంభమైన ఈ ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగింది, అనేక మంది దాతలను సంప్రదించింది. సొంత గ్రంథాలయాల నుంచి పుస్తకాలను ఇవ్వలేని వారు కొనుగోలు చేసి ఇచ్చారు.5 సంవత్సరాల్లో సుమారు లక్ష పుస్తకాలను సేకరించారు. హైదరాబాద్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోన్ని అనేక చోట్ల గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. దిల్లీ, బెంగళూర్, కోల్‌కత్తా, హర్యానా, అస్సాం, మిజోరాం,ఒడిస్సా, మేఘాలయ అనేక రాష్ట్రాలకు ‘ఫుడ్ ఫర్ థాట్’ విస్తరించింది. సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఇది చేరువైంది. అదే సమయంలో వేలాది మంది దాతలను ఒక్కటి చేసింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రముఖ పాఠశాలలు, కార్పొరేట్ సంస్థలు, తదితర చోట్ల ‘ఫుడ్ ఫర్ థాట్’ బాక్సులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పుస్తకాలను సేకరించింది.
ఇల్లిల్లూ పుస్తకాలయం...
‘పిల్లల కోసం లైబ్రరీలను ఏర్పాటు చేయడం ఒక ఉద్యమంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రతిఇంట్లోను పుస్తక పఠనానికి పెంచాలనే లక్ష్యంతో ‘ఘర్ ఘర్ పుస్తకాలయ్(జీజీపీ) కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలో ఇది ప్రారంభమవుతుంది. పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న ఇంటికి 50 పుస్తకాల బాక్సును అందజేస్తాం. వారు చదవడంతో పాటు ఇరుగు పొరుగు వాళ్లకుఅందజేయాలి. ఇలా ప్రతి ఇల్లు ఒక పుస్తకాలయం కావాలన్నదే మా లక్ష్యం..’ అని చెప్పారు ఫుడ్ ఫర్ థాట్ కో–ఫౌండర్ షిఫాలీరావు. ఘర్ ఘర్ పుస్తకాలయ్ ఉద్యమాన్ని సైతం నగరంలో ప్రారంభించి దేశమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఫుడ్ ఫర్ థాట్‌కు పుస్తకాలను ఇవ్వాలనుకొనే దాతలు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని ఆ సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా. ఆ సంస్థ వెబ్‌సైట్ ద్వారా కూడా చేరుకోవచ్చు. ఒక లైబ్రరీకి సరిపోయే 200 పుస్తకాలు ఉంటే ఆ సంస్థప్రతినిధులే స్వయంగా వచ్చి తీసుకెళ్తారు.
నాలెడ్జ్ సొసైటీ నిర్మాణం జరగాలి
మా ఇంట్లో అందరం బాగా పుస్తకాలు చదువుతాం. ఆ అలవాటును పది మందికీ పరిచయం చేయాలనిపించింది. మాలాగా చదివే అలవాటు ఉన్న వారిని పుస్తకదాతలుగా ప్రోత్సహించాలని కూడా భావించాం. ఒకేవిధమైన ఆలోచన ఉన్నవారికి ఫుడ్ ఫర్ థాట్ ఒక వేదికైంది. హైదరాబాద్‌లో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశమంతటా విస్తరించినందుకు చాలా సంతోషంగా ఉంది.– కె.శ్రీనివాస్‌రావు, ఫుడ్ ఫర్ థాట్ వ్యవస్థాపకులు
పాఠ్యపుస్తకాలు వద్దు
ఫుడ్ ఫర్ థాట్ పాఠ్యపుస్తకాలను స్వీకరించడం లేదు. స్కూళ్లలో ఎలాగూ ఆ పుస్తకాలనే బోధిస్తారు. అందుకే చరిత్ర,సంస్కృతి, జనరల్ నాలెడ్జ్,సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకాలను స్వీకరించి పిల్లలకు అందజేస్తున్నాం.– షిఫాలీరావు, సహ వ్యవస్థాపకులు
ఇతిహాస కథలతో ఆడియోలు
పుస్తకాలతో పాటు ఇప్పుడు రామాయణం, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాల నుంచే సేకరించిన కథలను ఆడియోల రూపంలో పిల్లలకు అందజేస్తున్నాం, యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షించే సదుపాయం కూడా ఉంది.– మాధవీ శర్మ, ఫుడ్ ఫర్ థాట్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment