
సుక్కకు ధరల కిక్కు
♦ బేసిక్ కేసు ధరపై 10 శాతం
♦ పెంపునకు సర్కారు అంగీకారం!
♦ ధరలు పెంచకుంటే ఉత్పత్తులు నిలిపేస్తామన్న డిస్టిలరీల హెచ్చరికల వల్లే..
♦ సీఎం కేసీఆర్ పరిశీలనలో బేవరేజెస్ కార్పొరేషన్ ప్రతిపాదనలు
♦ కేటగిరీని బట్టి క్వార్టర్‌కు రూ. 6 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో మందుబాబులకు ధరల కిక్కు తగలనుంది. బ్రాండ్‌నుబట్టి క్వార్టర్‌కు రూ. 6 నుంచి రూ. 30 వరకు పెరిగే అవకాశం ఉంది. బేసిక్ కేసు ధరపై 10% పెంపునకు సర్కారు అంగీకరిం చింది! పెంచిన ధరల్లో పన్నులను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని డిస్టిలరీల యాజమాన్యాలకే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒప్పుకుంది. ధరలు పెంచకపోతే తమ ఉత్పత్తులు నిలిపేస్తామంటూ కంపెనీలు హెచ్చరించిన నేపథ్యంలో మద్యం ధరల పెంపుపై తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఈ నెల రెండో వారం నాటికి ధరల పెంపు ఉత్తర్వులు వెలువడనున్నాయి.
2012 నుంచి పాత ఒప్పందమే...
రాష్ట్రానికి వివిధ బ్రాండ్లకు చెందిన దాదాపు 100 కంపెనీలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. రాష్ట్రానికి అవసరమైన మద్యం సరఫరా కోసం ప్రభుత్వం ఏటా మద్యం కంపెనీలతో ఒప్పందం చేసుకుంటోంది. సాధారణంగా మే నుంచి జూన్ వరకు కాంట్రాక్టు గడువు ఉంటుంది. అవసరాన్నిబట్టి టీఎస్‌బీసీఎల్ మరో ఏడాది దాన్ని పొడిగించవచ్చు. కానీ వేర్వేరు కారణాలతో ప్రభుత్వం ఐదేళ్లుగా టెండర్లు పిలవట్లేదు. 2011లో కుదిరిన ఒప్పందం 2012 జూన్‌తోనే ముగిసినా పాత ఒప్పందాన్నే ప్రభుత్వం రెన్యువల్ చేసుకుంటూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకొచ్చాక యాజమాన్యాల డిమాండ్ సాధ్యాసాధ్యాలపై ముగ్గురు సభ్యులతో ధరల నిర్ణాయక కమిటీని ఏర్పాటు చేసింది. ధరల పెంపుపై చర్చించిన ఈ కమిటీ... కంపెనీలకు అదనపు ధర కట్టివ్వొచ్చని అప్పట్లోనే నివేదిక ఇచ్చింది. తాజాగా అదే నివేదిక ఆధారంగా బేసిక్ కేసు ధరపై 10 శాతం ధరలు పెంచాలని టీఎస్‌బీసీఎల్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
మొలాసిస్ కొరత కూడా కారణమే...
రాష్ట్రంలో చక్కర పరిశ్రమలు లేకపోవడం, నిజాం షుగర్స్ కూడా మూతపడటంతో చెరకు మొలాసిస్ కొరత ఏర్పడింది. ఈ నేపధ్యంలో గ్రెయిన్ ఆధారిత (నూకలు, బియ్యం, మొక్కజొన్న) ఈఎన్‌ఏ నుంచి (ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) లిక్కర్ తయారు చేసే విధానాన్ని సర్కారు అమల్లోకి తెచ్చింది. ఇది ఖర్చుతో కూడిన పని అని డిస్టిలరీ యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతోపాటు ముడి సరుకుల ధరలు, బాటిల్ ధర, కార్మికుల జీతభత్యాలు పెరిగిన నేపధ్యంలో ఉత్పతి వ్యయం భారిగా పెరిగిందని, దీనికి అనుగుణంగా ప్రభుత్వం ధరలు పెంచలేదంటున్నాయి. డిస్టిలరీ యాజమాన్యల నుంచి టీఎస్‌బీసీఎల్... చీప్ లిక్కర్ పెట్టెకు (48 క్వార్టర్లు లేదా 12 ఫుల్ బాటిల్స్) రూ. 445 చొప్పున కొనుగోలు చేస్తోంది. మీడియం లిక్కర్‌ను పెట్టెకు రూ. 585 చొప్పున, ప్రీమియం మద్యాన్ని పెట్టెకు రూ. 1,300 నుంచి రూ. 2,200 వరకు చెల్లిస్తోంది. అయితే ఈ ధర తమకు గిట్టుబాటు కావట్లేదని, నష్టాలతో కంపెనీలు నడపలేమని యాజమాన్యాలు చెబుతున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం నేపథ్యంలో మద్యం కేటగిరీనిబట్టి ప్రస్తుతం టీస్‌బీసీఎల్ ఇస్తున్న బేసిక్ ధరపై కనీసం 15 శాతం అదనపు ధర చెల్లించాలని పట్టుబడుతున్నాయి. 2010లో అప్పటి రోశయ్య ప్రభుత్వం ధరలను స్వల్పంగా పెంచాక మళ్లీ ఇప్పటివరకు ధరలు పెంచలేదని గుర్తుచేస్తున్నాయి.