
'ముందు' బాబులు
తెల్లారక ముందే మద్యం దుకాణాల వైపు అడుగులు
► ‘ఉతార్ సుక్క’ పడ్డాకే పనులకు..
► దుకాణం తెరవక ముందే 20 శాతం విక్రయాలు
► కార్మికులు, వ్యవసాయ కూలీలే అధికం
► నాలుగు నెలల్లోనే 10 లక్షల పెట్టెల అదనపు లిక్కర్ విక్రయం
ఒకానొక రోజు
సమయం: 5.30 గంటలు (ఉదయం)
స్థలం: సంగారెడ్డి పట్టణం. పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఓ మద్యం దుకాణం
అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఓ మధ్య వయసు వ్యక్తి మద్యం దుకాణం వైపు నడుస్తున్నాడు. షెట్టర్లు మూసే ఉన్నాయి. ఎలాంటి తడబాటు లేకుండా దుకాణం పక్క సందులోంచి పర్మిట్ రూంలోకి వెళ్లాడు. రూ.100 నోటు ఇచ్చి క్వార్టర్ చీప్ లిక్కర్, ఒక నీళ్ల ప్యాకెట్ తీసుకున్నాడు. మూత తీసి సగం లిక్కర్ తాగాడు. తర్వాత ప్యాకెట్ నీళ్లు తాగి ఓచోట కూర్చున్నాడు. కాసేపటికే మరోవ్యక్తి.. మరొకరు.. ఇంకొకరు.. ఇలా వస్తూనే ఉన్నారు! ‘ఉతార్’ సుక్కేస్తున్నారు. గంట వ్యవధిలోనే అంటే ఉదయం 6.30కే పర్మిట్ రూం మందుబాబులతో సందడిగా మారింది. వాస్తవానికి ఉదయం 10 గంటలకు దుకాణం తెరవాలి. కానీ అప్పటికే దాదాపు 150 మందికి పైగా మద్యం తాగి వెళ్లిపోయారు.
...ఇలా ఒక్క సంగారెడ్డి మద్యం దుకాణాల్లో మాత్రమే కాదు. రాష్ట్రంలో చాలాచోట్లా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలతెలవారుతుండగా పనికి వెళ్లాల్సిన జనం ఇలా మద్యం దుకాణం వైపు అడుగులు వేస్తున్నారు. పరగడుపునే ఒకటో.. రెండో పెగ్గులు తాగిన తర్వాతే దినచర్యను మొదలుపెడుతున్నారు. ముందురోజు రాత్రి తాగింది తలకు పట్టి ఇబ్బంది పెడుతుండటంతో(హ్యాంగోవర్) పొద్దున్నే ఉతార్ సుక్కతో ఉపశమనం పొందుతున్నామని చెబుతున్నారు. ఉదయం పూట డిమాండ్ ఉండటంతో దుకాణ యజమానులు అక్రమంగా మద్యాన్ని అందుబాటులో పెడుతున్నారు.
ముందు రోజు రాత్రి దుకాణం మూసే సమయంలోనే స్టోర్ రూం నుంచి మద్యం బాటిళ్లను పర్మిట్ రూంలోకి చేర్చి పొద్దున్నే విక్రయిస్తున్నారు. ప్రతిరోజు దుకాణం తెరవక ముందే 20 శాతం మద్యం అమ్ముడు పోతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణం, ఫ్యాక్టరీ కార్మికులు, రోజువారీ కూలీలు ఎక్కువగా ఉండేచోట పొద్దున పూట అమ్మకాలు 25–30 శాతం వరకు ఉన్నాయి. కూలీలు, పలు కంపెనీల్లో పనిచేసే కిందిస్థాయి కార్మికులు అధికంగా ఉండే హైదరాబాద్‌లోని నిజాంపేట, గచ్చిబౌలి, నాగోల్, కాటేదాన్, పటాన్‌చెరు, ఎల్బీనగర్‌తోపాటు సంగారెడ్డి, మల్లాపూర్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోంది. ఉదయం పూట ఈ మద్యం దుకాణాల క్రయవిక్రయాల లెక్కలు పరిశీలించగా.. మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు 25 శాతం అధికంగా ఉండటం గమనార్హం.
లేవంగనే పడాల్సిందే
మల్లేశం, పటాన్‌చెరు : పొద్దున్నే ‘90’ ఏసుకుంటా. తాగకుంటే తలకాయ రివరివ అంటది. ఏ పని చేతగాదు. తాగినంకనే ఫ్యాక్టరీకి పోతా..
సంజీవ్, సంగారెడ్డి : నా పైసల్ నా ఇష్టం. మీ ఇంట్లె నుంచి ఇస్తుండ్రా.. పొద్దున్నే తాగుతా. 10సంవత్సరాల నుంచి తాగుతున్న. తాగినంకనే పనికి పోతా.
శ్రీనివాస్, సూర్యాపేట : లేవంగనే ఉతార్ పడాల్సిందే. లేకుంటే పాణం చేతగాదు. పని చేయలేను. రోజంతా కలిపి అద్దసేరు (ఆఫ్ బాటిల్) తాగుతా.
పెరుగుతున్న మందుబాబులు..
ఎక్సైజ్ అధికారుల అంచనాల ప్రకారం ఏటా సగటున 5 శాతం మంది కొత్తగా మద్యానికి అలవాటు పడుతుంటారు. వారిలో 0.5 శాతం దానికి బానిసలవుతారు. కానీ మూడేళ్లుగా మద్యం అలవాటు విపరీతంగా పెరిగిపోతోంది. ఎక్సైజ్ నివేదికల ప్రకారం ఏటా 12 శాతం కొత్తగా మద్యానికి అలవాటు పడుతుండగా.. వారిలో 2 శాతానికి పైగా బానిసలవుతున్నట్టు తేలింది.
గత 4 నెలల మద్యం విక్రయాలు చూస్తే ఈ ఏడాది ఏప్రిల్– జూలై 4 నెలల్లో రూ.5,610 కోట్ల మద్యం వ్యాపారం సాగింది. గతేడాది కంటే 10 లక్షల కేసుల (ఒక కేసు అంటే 12 ఫుల్ బాటిల్స్) మద్యం అదనంగా విక్రయించారు. తెలంగాణ బ్రూవరేజస్ కార్పొరేషన్ 95.04 లక్షల కేసులు విక్రయించింది. గతేడాది ఇదే 4 నెలల కాలంలో 85.47 లక్షల కేసులే అమ్ముడయింది. అంటే ఈ ఏడాది అదనంగా రూ.1,000 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది!
ఇక్కడ సరిపోక.. పక్క రాష్ట్రాల నుంచి..
తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా చేయాలని ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఉంది. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సారా బట్టీలు ధ్వంసం చేయడంతోపాటు గుడుంబాపై బతికే కుటుంబాలకు పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. అయితే ఇంతకాలం గుడుంబా తాగిన జనం ఇప్పుడు మద్యం వైపు మళ్లారు. దీంతో నెలకు మూడు లక్షల చీప్, మీడియం లిక్కర్ పెట్టెలు అదనంగా అమ్ముడుపోతున్నట్లు ఎక్సైజ్ లెక్కల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మద్యం సరిపోక పోవటంతో ప్రభుత్వం ఎక్సైజ్ నిబంధనలు సడలించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 19 మద్యం ఉత్పత్తి డిస్టిలరీలు ఉన్నాయి. వీటినుంచి ఏడాదికి 2349.05 ఎల్‌పీఎల్‌ల మద్యం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలక పక్క రాష్ట్రాల నుంచి మీడియం లిక్కర్ దిగుమతికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
..: సాక్షి, హైదరాబాద్