
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని షెడ్యూల్ ప్రాంతాల్లో మద్యం షాపులు పెట్టాలంటే ఆయా గ్రామసభల తీర్మానాలు తప్పక ఉండాలని, గ్రామసభ ఆమోదం లేకుండా మద్యం షాపులకు అనుమతివ్వడానికి వీల్లే దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ఆదేశిస్తూ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పెసా’ యాక్ట్ ప్రకారం ఆదివాసీ ప్రాంతా ల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం తప్పనిసరని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ చట్టంలో గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక హక్కు కల్పిస్తూ ‘పెసా’ నిబంధనల్ని అమల్లోకి తెచ్చారన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆదివాసీ ప్రాంతాల్లోని 17 గ్రామాల్లో మద్యం షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జారీచేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పోడెం రత్నం అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. మద్యం షాపుల ఏర్పా టుకు చట్ట నిబంధనల్ని అమలు చేయాలంటూ గతనెలలో సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. దీనిపై పిటిషనర్ పోడెం రత్నం అప్పీల్ చేయడంతో ధర్మాసనం గురువారం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరిస్తూ తీర్పునిచ్చింది. మద్యం షాపుల ఏర్పాటుకు నోటీసులు జారీ చేసిన నెలరోజుల్లో గ్రామ పంచాయతీలు అంగీకరిస్తూ తీర్మానాలు వస్తాయనే ఆశాభావంతో ముందుగానే అనుమతులివ్వడం చెల్ల దని స్పష్టం చేసింది. జిల్లాలోని ఆదివాసీ ప్రాంతంలో 17 మద్యంషాపుల ఏర్పాటుకు ఇంతవరకు నోటీసు లు జారీ కాలేదని, గ్రామ సభలు అనుమతి కోరలేదని పిటిషనర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామసభలుంటేనే మద్యం షాపులకు అనుమతి ఇవ్వాలని లేకుంటే వద్దని ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment