రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు లెక్కలను చూసేందుకు మే 27 నుంచి జూన్ 6వ తేదీ వరకు అధికారికంగా సెలవు ప్రకటించారు.
నిజామాబాద్‌క్రైం, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలో నిలిచిన మద్యం సరఫరా మళ్లీ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ బేవరేజెస్‌ను విభజించి ఆదాయ వ్యయాలు, అప్పులు లెక్కలను చూసేందుకు మే 27 నుంచి జూన్ 6వ తేదీ వరకు అధికారికంగా సెలవు ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు బ్యాంక్ ఖాతా తొందరగానే తెరువటంతో గడువుకన్నా మూడురోజుల ముందుగానే ఐఎంఎల్ డిపో తెరుచుకుంది. ఈ సెలవుల నేపథ్యంలో జిల్లాలో మద్యం కొరత లేకుండా అధికారులు మద్యం దుకాణాలు, బార్‌లకు నెలవారీ లెసైన్స్‌ల స్థాయిని బట్టి మే నెల చివరి వారం వరకు మద్యం సరఫరా చేసేశారు. మే 27 తర్వాత మద్యం సరఫరా నిలిపేశారు. డిపో మూసివేతతో మద్యం వ్యాపారులు తిగిరి డిపో తెరుచుకునే వరకు మద్యం స్టాక్‌లకు డీడీలిచ్చారు. వాటి ప్రకారం వారికి మద్యం సరఫైరా అయింది. దీంతో మద్యం విక్రయాలు భారీగా సాగినట్లు తెలిసింది.
మూడు నెలలు అంతంత మాత్రమే..
జిల్లాలో 123 మద్యం దుకాణాలు, 15 బార్లు, 2 క్లబ్‌లున్నాయి. వీటి ద్వారా నెలకు 45 కోట్ల నుంచి 50 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు సాగుతాయని అంచనా. అయితే గడిచిన మూన్నెళ్లుగా వ్యాపార ం మాత్రం ఆశించిన రీతిలో సాగలేదు. ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ముమ్మర తనిఖీలు, దాడులు చేశారు. దీంతో వ్యాపారులు భారీగా మద్యాన్ని నిల్వలు చేయకపోవటంతో ఆశించిన మేర వ్యాపారం సాగలేదు. అయితే మే నెలలో మాత్రం లిక్కరు లక్షా 86 వేల కార్టున్లు, బీర్లు 2లక్షల 22 వేల కార్టున్లు స్టాక్ సరఫరా అయ్యింది. వీటి మొత్తం విలువ 57 కోట్ల 90 లక్షల 13వేల 177 అమ్మకాలు సాగాయి.
సెలవులతో ఇబ్బంది..
వేసవి సెలవులు కావడంతో మద్యం విక్రయాలు బాగుంటాయని ఆశించిన వ్యాపారులకు బేవరేజెస్ సెలవులు కొంత ఇబ్బందిగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల మద్యం కంపెనీల నుంచి వచ్చే మద్యానికి ఏపీ బేవరేజెస్ స్టిక్కర్ల ద్వారా విక్రయాలు జరిపేవారు. జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. రాష్ట్ర విభజనకు ముందే బేవరేజెస్‌ను రెండు రాష్ట్రాలకు సమ పద్ధతిలో కేటాయించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం మే 28 నుంచి జూన్ 7వ తేదీ వరకు పూర్తి చేయాలనుకున్నారు. దీనిలో భాగంగానే బేవరేజెస్‌ను కొద్ది రోజులపాటు మూసివేయాలని నిర్ణయించారు. నిల్వ ఉన్న మద్యాన్ని పూర్తిస్థాయిలో విక్రయించారు. పది రోజులపాటు జిల్లాలో మద్యం సరఫరా లేక ఇబ్బందులు పడ్డారు. మళ్లీ డిపో తెరుచుకోవటంతో మద్యం సరఫరా యథావిధిగా సాగుతోంది.