జనతా కర్ఫ్యూ.. ఆ వెంటనే అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అందులో భాగంగా రైళ్లను కూడా ఎక్కడికక్కడ ఆపివేశారు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి జయలుదేరే రైళ్ల ఇంజన్లు, గూడ్స్ బోగీలను స్టేషన్ పక్కనే ఉన్న యార్డులో నిలిపారు. వీటికి తోడు సికింద్రాబాద్ యార్డు కూడా నిండిపోగా అక్కడి నుంచి కొన్ని ఇంజన్లను ఇక్కడికి పంపించారు. దీంతో యార్డులోని అన్ని లైన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంజన్లు, బోగీలతో ఇలా నిండిపోయాయి.
– కాజీపేట రూరల్
సాక్షి, హన్మకొండ: ప్రతికూల పరిస్థితులతో టీఎస్ ఆర్టీసీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ఉద్యోగుల సమ్మె.. ఆ తర్వాత కొద్దిగా కోలుకునే స్థితికి రాగానే కరోనా వైరస్‌తో లాక్‌డౌన్ విధించడంతో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో ఆర్టీసీ పరిస్థితి ఆగమాగంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిమితంగా బస్సులు నడపడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆర్టీసీ వర్గాల్లో కొంత సంతోషాన్ని కలిగిస్తున్నా... మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఇక ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే మాత్రం బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఆదాయంలో ముందంజ
టీఎస్ ఆర్టీసీలో 11 రీజియన్లు ఉన్నాయి. ఇందులో ఒక్క వరంగల్ రీజియన్ మాత్రమే ఆదాయ సముపార్జనలో ముందుంది. వరంగల్ రీజియన్ లాక్‌డౌన్ నాటికి రూ.3 కోట్ల లాభాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతుండగా.. మిగతా రీజియన్లు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీలో ఉద్యోగుల సమ్మె ముగిశాక వరంగల్ రీజియన్ ఆదాయపరంగా పుంజుకుంటున్న క్రమంలోనే కరోనా వైరస్ ప్రతిబంధకంగా మారింది.
బస్సుల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉన్న హన్మకొండలోని జిల్లా బస్టాండ్
డిపోల్లోనే బస్సులు
లాక్‌డౌన్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో 962 బస్సులు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీకి సగటున రోజుకు వచ్చే ఆదాయం రూ.137.77 లక్షల చొప్పున 43 రోజులకు రూ.57.09 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లయింది. వరంగల్ రీజియన్‌లో 962 షెడ్యూళ్ల ద్వారా రోజుకు 3.95 లక్షల కిలోమీటర్లు తిరిగి 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంస్థలోని 1,734 మంది కండక్టర్లు, 1,564 మంది డ్రైవర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ గ్రీన్ జోన్లలో బస్సులు తిప్పడానికి అవకాశవిుస్తామని చెప్పడం ఆర్టీసీ వర్గాలకు కొంత ఊరట కలిగించింది. అయితే రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న క్రమంలో ప్రజారవాణాకు అనుమతిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్వహణ లేక సమస్యలు
లాక్‌డౌన్‌తో 43 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడం వాటి పనితీరుపై ప్రభావం చూపే అవకాశముంది. బస్సుల బ్యాటరీలు, ఇతర భాగాలు దెబ్బ తినే అవకాశముందని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రతిరోజు బస్సులను కొద్ది సేపు ఆన్‌లో ఉంచి బ్యాటరీలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బస్సులు నడిపేందుకు అనుమతించినా తాము సిద్ధంగా ఉన్నామని... బస్సులు కూడా కండీషన్‌లో ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఉద్యోగులు 53 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు రాజధాని, గరుడ ఏసీ బస్సులు నడపలేదు. అయినా ఉద్యోగులు విధుల్లో చేరిన వెంటనే ఏసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపామని గుర్తు చేస్తున్నారు.
భౌతిక దూరం పాటించాలంటే కష్టమే...
వరంగల్ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్‌లో ఉండగా.. మిగతా జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్‌లలో ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్–1, 2, హన్మకొండ డిపోలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట, పరకాల డిపోలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు, జనగామ జిల్లాలో జనగామ డిపో ఉండగా.. ములుగు జిల్లాలో ఆర్టీసీ డిపో లేదు. తాజాగా ప్రజారవాణాను పునరుద్ధరించి బస్సులు నడిపినా 50 శాతం సీట్లలోనే ప్రయాణికులను తీసుకెళ్లాలని ప్రధాని వెల్లడించారు.
ఈ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడిపినా నష్టాలు వస్తాయని.. నిర్వహణ ఖర్చులు కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు. వరంగల్ రీజియన్‌లో 73 శాతం అక్యుపెన్సీ రేషియో(ఓఆర్)తో బస్సులు నడుస్తుండగా.. 50 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడిపిస్తే నష్టాలు కొని తెచ్చుకోవాలి్సందే. కానీ అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలనుకునే వారికి మాత్రం బస్సులు నడపడం ద్వారా ఇబ్బందులు తీరతాయి. అయితే, బస్సు విశాలంగా ఉండడంతో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించే అవకాశంతో పాటు కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు శానిటేషన్ చేసే అవకాశమున్నందున కరోనా వైరస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment