మృత్యులారీ మింగేసింది
* రంగారెడ్డి జిల్లా తొండుపల్లి వద్ద ఘటన
* ఇద్దరి దుర్మరణం
* మూడు కార్లను, ఆటోను, బైక్‌ను ఢీకొట్టిన లారీ
* ప్రమాదం ధాటికి దాని కింద ఇరుక్కుపోయిన ఆటో
* విస్తరణ పనుల్లో జాప్యమే కారణం: స్థానికుల ధ్వజం
శంషాబాద్ రూరల్: పేరుకు జాతీయ రహదారే అయినా అక్కడంతా కారుచీకటి. ఉన్నట్టుండి మృత్యుశకటమై దూసుకొచ్చిన ఓ లారీ, ఎదురొచ్చిన ప్రతి వాహనాన్నీ ఢీకొడుతూ కొద్దిసేపు బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి రంగారెడ్డి జిల్లాలో బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలవగా మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ నుంచి షాద్‌నగర్ వైపు వెళ్తున్న లారీ శంషాబాద్ మండలంలో తొండుపల్లి ఔటర్ జంక్షన్ వద్ద అదుపు తప్పింది. రోడ్డుపై వెళ్తున్న మూడు కార్లతో పాటు, ఓ ఆటోను, బైక్‌ను ఢీకొట్టింది. దాంతో కార్లు రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కకు దొర్లిపోయాయి. తర్వాత లారీ రోడ్డు పక్కనున్న గోతిలోకి వెళ్లి ఆగింది. ఆటో ఏకంగా లారీ కింద ఇరుక్కుపోవడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి బైక్‌పై షాద్‌నగర్ వెళ్తున్న టోలిచౌకివాసి మహ్మద్ రఫీక్ (30), షాద్‌నగర్ నుంచి ఆటోలో శంషాబాద్ వస్తున్న హైమద్‌నగర్ వాసి మహ్మద్ షబీర్ (32) అక్కడికక్కడే మృతి చెందారు.
రఫీక్ వెంట ఉన్న మహ్మద్ నయీం (30), కార్లలో వెళ్తున్న మహబూబ్‌నగర్ వాసి మహ్మద్ జాఫర్ (55), పార్థసారథి (28), అతని కుమారుడు వరుణ్ (8), డ్రైవర్ సుదర్శన్‌రెడ్డి (40), కొత్తపేటకు చెందిన నికత్ (50), ఒవైసీ అలీ (55), నూరి (62), ఉజ్మా(17), ఆటోలో వెళ్తున్న శంషాబాద్ వాసి అస్లం (22) తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటోను క్రేన్ సాయంతో లారీ కింద నుంచి తీసిన పోలీసులు మృతదేహాలను స్థానిక క్లస్టర్ ఆస్పత్రి మార్చురీకి, క్షతగాత్రులను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
చీకట్లో రోదనలు
ప్రమాద స్థలి వద్ద ఎలాంటి లైట్లూ లేకపోవడంతో ఏం జరిగిందో కొద్దిసేపటిదాకా అర్థం కాక ఇతర వాహనదారులు భీతిల్లారు. పైగా అక్కడ రోడ్డు బాగా ఇరుగ్గా ఉండటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంబులెన్స్‌లు కూడా అక్కడిదాకా రావడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. లారీ కింద ఇరుక్కున్న వాహనాలను క్రేన్ సాయంతో అతికష్టమ్మీద బయటకు తీశారు. వాటిలో ఎంతమంది ఉన్నదీ తెలియక, కనీసం ఐదారుగురికి పైగా మరణించి ఉంటారని తొలుత భావించారు.
తొండుపల్లి వద్ద రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరగడమే ప్రమాదానికి కారణమంటూ మృతులు, క్షతగాత్రుల బంధువులు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలనే డిమాండ్‌తో రోడ్డుపై ధర్నాకు దిగారు. దాంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి.