
ప్రేమించలేదని.. పొడిచి చంపేశాడు!
- కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ గాయత్రి వెంటపడిన శ్రీకాంత్
- నిరాకరించినా వినకుండా వేధింపులు.. గ్రామ పెద్దల సమక్షంలో మందలింపు
- దీనిపై కసి పెంచుకున్న శ్రీకాంత్.. ఎవరూ లేని సమయంలో గాయత్రిపై దాడి
- కత్తితో విచక్షణారహితంగా పొడిచి పరారీ
ప్రేమోన్మాదం కోరలు చాచింది. తన ప్రేమను నిరాకరించిందన్న ఆగ్రహంతో శ్రీకాంత్ అనే యువకుడు గాయత్రి అనే యువతిని దారుణంగా చంపేశాడు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో చొరబడి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి.. పారిపోయాడు. బాధతో కేకలు వేస్తూ, రక్తపు మడుగులో పడిపోయిన ఆమెను ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా.. మార్గమధ్యం లోనే ఆమె కన్నుమూసింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని యాదగిరిపల్లిలో శనివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.
యాదగిరిగుట్ట: యాదగిరిపల్లికి చెందిన సూదగాని సాయిలు– లక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె గాయత్రి (20). సాయిలు యాదాద్రి దేవస్థానంలో చిరుద్యోగి. భువనగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో గతేడాది డిగ్రీ పూర్తి చేసిన గాయత్రి.. అప్పటినుంచి ఇంటి వద్దే ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతున్నాడు. తనకు ఇష్టం లేదంటూ పలుమార్లు శ్రీకాంత్‌కు స్పష్టం చేసిన గాయత్రి.. చివరికి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా పలుమార్లు పెద్దల సమక్షంలో శ్రీకాంత్‌ను మందలించారు. అయినా శ్రీకాంత్‌లో మార్పు రాకపోవడంతో... ఇటీవల మరోసారి గ్రామ పెద్దలు, స్థానికులు తీవ్రంగా మందలించారు. మరోవైపు గాయత్రికి ఇటీవలే ఓ పెళ్లి సంబంధం కుదిరింది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.
అయితే గాయత్రి తనను ప్రేమించలేదని కసి పెంచుకున్న శ్రీకాంత్ ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం మధ్యాహ్నం గాయత్రి తండ్రి సాయిలు విధులకు వెళ్లిపోగా, తల్లి లక్ష్మి వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లింది. గాయత్రి ఒంటరిగా ఉందని గమనించిన శ్రీకాంత్... మెల్లగా వారి ఇంట్లోకి వెళ్లి కత్తితో గాయత్రి కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో పరారయ్యాడు. కేకలు విని సోదరుడు, ఇరుగుపొరుగు వారు వచ్చారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న గాయత్రిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలో ఆమె కన్నుమూసింది. ఘటనా స్థలాన్ని యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించి, ఆధారాలను సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
కన్నీటి సంద్రంలో కుటుంబం
ఒక్కగానొక్క కుమార్తె మరణించడంతో సాయిలు కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. గాయత్రి హత్య విషయం తెలుసుకుని తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఉదయం నుంచి తమతోనే ఉన్న గాయత్రి సాయంత్రం ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురవడాన్ని బంధువులు, ఇరుగుపొరుగువారు తట్టుకోలేకపోతున్నారు. గాయత్రిని దారుణంగా పొడిచి హత్య చేసిన శ్రీకాంత్‌ను వదలకూడదని, కఠినంగా శిక్షించాలని ఆమె తండ్రి సాయిలు, బంధువులు డిమాండ్ చేశారు. గాయత్రి లాంటి పరిస్థితి మరొకరికి రాకుడదంటూ పోలీసులను వేడుకున్నారు.
లొంగిపోయిన ఉన్మాది?
గాయత్రిని హత్య చేసిన శ్రీకాంత్ యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. యాదగిరిపల్లిలో గాయత్రిని పొడిచింది తానేనని అతను నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అంగీకరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నిందితుడు పరారీలోనే ఉన్నాడని, ఆచూకీ లభ్యం కాలేదని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ ఆంజనేయులు చెప్పారు.