
సభ కీర్తిని ఇనుమడింపజేస్తా
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల ఆకాంక్షల మేరకు అందరం పనిచేయాలని, అందుకు ఈ సభ వేదిక కావాలని తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజల ఆకాంక్షల మేరకు అందరం పనిచేయాలని, అందుకు ఈ సభ వేదిక కావాలని తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు. ‘శాసనసభ కీర్తిని ఇనుమడింప చేస్తాను. అందుకు మీరంతా సహకరించా’లని ఆయన కోరారు. స్పీకర్‌గా ఆయన మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యుల అభినందనలతో ఆయన కళ్లు చెమర్చాయి. అనంతరం ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. చట్టసభ విలువలు, ప్రమాణాలు పెంచడానికి కృషి చేస్తానని, రాజకీయ రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలకు అతీతంగా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇది మహత్తరమైన, చరిత్రాత్మకమైన ఘట్టం అని ఆయన అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికీ శిరస్సువంచి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం శాసనసభ ప్రారంభం కాగానే, తెలంగాణ తొలి శాసనసభాపతిగా సిరికొండ మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన జానారెడ్డి ప్రకటించారు. స్పీకర్ పదవికి మధుసూదనాచారి ఒక్కరే నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు జానారెడ్డి ప్రకటించగానే.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, డాక్టర్ జె. గీతారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, డాక్టర్ కె. లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, మహ్మద్ పాషా ఖాద్రి, తాటి వెంకటేశ్వర్లు, ఇంద్రకరణ్‌రెడ్డి, సున్నం రాజయ్య, మహమూద్ అలీ, రవీంద్రకుమార్, ఈటెల రాజేందర్ తదితరులు సిరికొండ మధుసూదనాచారిని స్పీకర్ స్థానం వైపు తోడ్కొని వెళ్లారు. మధుసూదనాచారి స్పీకర్ స్థానం దగ్గరకు రాగానే, అప్పటి వరకు ప్రొటెం స్పీకర్‌గా ఉన్న జానారెడ్డి లేచి ఆయనను ఆలింగనం చేసుకుని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం స్పీకర్‌ను అభినందిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, సభ్యులు ప్రసంగించారు.
కళ్లు చెమర్చాయి : కేసీఆర్
తెలంగాణ పదాన్ని నిషేధించిన ఈ సభలో తెలంగాణ శాసనసభ్యుడినని ప్రమాణం చేసినప్పుడు కళ్లు చెమర్చాయి. ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టం. తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీల్లేదని అప్పటి స్పీకర్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం, ఇప్పుడు అదే స్థానంలో తెలంగాణ ఉద్యమకారుడు అధిరోహించడం చరిత్రాత్మక ఘటన. నేను డిప్యూటీస్పీకర్‌గా ఉన్న సమయంలో పార్టీకి, పదవులకు రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న పార్టీ ఏర్పాటు చేశాను. అయితే, అంతకు ఏడాదిముందే మధుసూదనాచారితో కలిసి ఉద్యమపంథా రచించాం. మీతో కలిసి పనిచేసిన రోజులను జన్మలో కూడా మరిచిపోలేను. ప్రజల చిరకాలవాంఛ నెరవేరింది. సభ్యులు ప్రమాణం చేస్తున్నప్పుడు వారి కళ్లల్లోనూ ఆనందబాష్పాలు గమనించాను. తెలంగాణ ఉద్యమకారులు సభను, ప్రభుత్వాన్ని నడిపించుకోవడం మరపురాని ఘట్టం. ఈ కొత్తసభ దేశంలోనే దేదీప్యమానంగా వెలగాలి. చక్కని ప్రజాస్వామ్య సంప్రదాయాలు పరిఢవిల్లాలి. సభా నిర్వహణలో మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం. మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సభానాయకుడిగా అన్నిపక్షాల నాయకులు, ఉపనాయకులతో మాట్లాడా. వారంతా సత్సంప్రదాయాన్ని కొనసాగించడానికి అంగీకరించి ఏకగ్రీవం చేసినందుకు ధన్యవాదాలు.
జానారెడ్డి(కాంగ్రెస్): ఇటీవలికాలంలో చట్టసభ ఔన్నత్యం దిగజారింది. సభ అంటే అల్లర్లు, అరుపులు, అధికార దర్పం, ధిక్కారధోరణి పెరిగింది. సమస్యల పరిష్కార వేదికగా శాసనసభ మారాలి. అధికారపక్షం అహంకారానికి, ప్రతిపక్షం ఆవేశానికి లోను కావద్దు. వికారపరిస్థితులు కల్పించొద్దు. మంచి సంప్రదాయాలు పాటించాలి. ప్రభుత్వం బాగా పనిచేస్తే.. ప్రతిపక్షం అభినందించాలి, ప్రతిపక్షం చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతిపక్షాలకు స్పీకర్ ఎక్కువ అవకాశం ఇవ్వాలి.
తలసాని శ్రీనివాసయాదవ్ (టీడీపీ): రాజకీయాలకు అతీతంగా సభ్యులకు అవకాశం ఇవ్వాలి. ఈ సభతోనే రాష్ట్ర ప్రజలకు మంచి ప్రయోజనాలు జరగాలి. మేము పూర్తి సహకారం అందిస్తాం.
తాటి వెంకటేశ్వర్లు(వైఎస్సార్‌సీపీ): స్పీకర్ బండికి ఇరుసులాంటి వారు. పాలక, ప్రతిపక్షాలను సమానంగా చూడాలి. అధికార, ప్రతిపక్షాలు కళ్లు అయితే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు కనురెప్పల్లాంటి వారు.
డాక్టర్ లక్ష్మణ్(బీజేపీ):మీరు నిన్నటి వరకు ఒక పార్టీ సభ్యుడు. ఇప్పుడు సభ్యులందరి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. కేవలం కుడివైపు కాకుండా ఎడమవైపు ఎక్కువగా చూడండి.
పలువురి అభినందనలు
ఇదిలా ఉండగా, స్పీకర్‌ను అభినందిస్తూ ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, మంత్రులు ఈటెల, హరీశ్‌రావు,పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సభ్యులు దయాకర్‌రావు, సున్నం రాజయ్య, ఇంద్రకరణ్‌రెడ్డి, ఖాద్రి, గీతారెడ్డి, కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రెడ్యానాయక్, చిన్నారెడ్డి, కొండా సురేఖ, రసమయి బాలకిషన్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, వినయ్ భాస్కర్ తదితరులు మాట్లాడారు. అనంతరం తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు స్పీకర్ మధుసూదనాచారి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
పల్లె నుంచి ప్రస్థానం..
వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లి గ్రామంలో వెంకటలక్ష్మీ, వెంకటనర్సయ్య దంపతులకు 1956 సెప్టెంబర్ 24న జన్మించారు సిరికొండ మధుసూదనాచారి. కాకతీయ యూనివర్సీటీ నుంచి ఎం.ఎ. ఇంగ్లిష్ పట్టా పొందారు. ఆయనకు భార్య ఉమాదేవి, ముగ్గురు కుమారులు ప్రదీప్‌కుమార్, ప్రశాంత్‌కుమార్, క్రాంతికుమార్‌లున్నారు. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయ అరంగేట్రం చేసిన సిరికొండ.. తొలినాళ్లలో ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితునిగా మెలిగారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యతలు నిర్వహించారు. ఆయన పనితీరు నచ్చిన ఎన్టీఆర్.. 1994 సాధారణ ఎన్నికలకు ఆరునెలల ముందుగానే సిరికొండను శాయంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబుతోనూ సన్నిహితంగా మెదిలారు. టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా 2001 నుంచి కేసీఆర్ వెన్నంటి సాగారు. తెలంగాణ భవన్‌లో కార్యకలాపాలను మధుసూదనాచారి అన్నీ తానై నడిపేవారు. తొలి నుంచి కేసీఆర్ తలలో నాలుకలా ఉంటూ వచ్చారు. మంత్రి పదవి ఆశించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్‌గా సేవలందించాలని సీఎం కేసీఆర్ చేసిన సూచన మేరకు ఆ బాధ్యతలు చేపట్టేందుకు మధుసూదనాచారి అంగీకరించినట్లు తెలిసింది.