- ఇంత ఎత్తయిన రూపం ఇదే చివరిసారి
- వచ్చే ఏడాది నుంచి తగ్గనున్న గణపయ్య ఎత్తు
- నేడు గవర్నర్ దంపతుల తొలిపూజ
- సాయంత్రం పూజలకు సీఎం కేసీఆర్
సాక్షి, సిటీబ్యూరో: ‘విశ్వరూపుడి’ ఈ ఏడాది విశేషాలు..
ఈ ఏడాది ఖైరతాబాద్ మహాగణపతికి శ్రీ కైలాస విశ్వరూపమహాగణపతిగా నామకరణం చేశారు.
1954లో ఖైరతాబాద్‌లో గణపతిని తొలిసారి ఏర్పాటు చేశారు. ఈ ఏడాదికి 60 ఏళ్ళు పూర్తయ్యాయి.
గణపతికి కుడివైపు లక్ష్మీనరసింహస్వామి, ఎడమ వైపు దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.
మహాగణపతి బరువు 40 టన్నులు
మహాగణపతి విగ్రహంతో పాటు రెండు వైపులా ఏర్పాటు చేసే విగ్రహాల తయారీకి కలిపి వినియోగించిన స్టీల్ 20 టన్నులు
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ 40 టన్నులు
గోనె సంచులు 10 వేల మీటర్లు
బంకమట్టి ఒకటిన్నర టన్నులు
నార రెండున్నర టన్నులు
చాక్ పౌడర్ 100 బ్యాగులు
సిబ్బంది 150 మంది
పూజా ద్రవ్యాలన్నీ ‘ఘన’మైనవే..
75 అడుగుల పొడవైన కండువా... 75 అడుగుల పొడవైన యజ్ఞోపవీతం... మహా‘ఘన’పతికే సొంతం. ఇవి నల్గొండ జిల్లాలో తయారయ్యాయి.
10 అడుగుల పొడవైన మూడు అగరుబత్తీల (ఒక్కొక్కటీ 72 గంటల పాటు) సువాసనలు పొందే అరుదైన అవకాశం ఇక్కడి ఉండ్రాలయ్యకే దక్కుతోంది. వీటిని అంబికా దర్బార్ బత్తి కంపెనీ అందిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇవి తయారు చేశారు.
మహాప్రసాదం...
ఈ ఏడాది శ్రీకైలాస విశ్వరూప మహాగణపతికి సమర్పించే లడ్డూ బరువు 5 టన్నులు(ఐదువేల కిలోలు). ఈ ప్రసాదాన్ని 2010 నుంచి తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్ అధినేత పి.వి.వి. ఎస్.మల్లికార్జురావు (మల్లిబాబు) అందిస్తున్నారు.
2010లో 600 కిలోలు
2011లో 2400 కిలోలు
2012లో 3500 కిలోలు
2013లో 4200 కిలోల లడ్డూను మహా గణనాథుడికి ప్రసాదంగా సమర్పించారు.
ఈ ఏడాది 5000 కిలోల (ఐదు టన్నులు) లడ్డూను సిద్ధం చేశారు.
గురువారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి లడ్డూ ప్రత్యేక వాహనంలో నగరానికి బయల్దేరింది. శుక్రవారం తెల్లవారుజాముకు నగరానికి చేరుకుంటుందని దాత మల్లిబాబు ‘సాక్షి’కి తెలిపారు.
నేడు గణనాథుడి తొలిపూజకు గవర్నర్...
ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ నరసింహన్ దంపతులు తొలిపూజలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ఉదయం 7గంటలకు పద్మశాలి సంఘం ఖైరతాబాద్ నియోజవర్గం వారి ఆధ్వర్యంలో తయారు చేసిన 75 అడుగుల యజ్ఞోపవీతం, అంతే పొడవున్న కండువాను మహాగణపతికి సమర్పిస్తారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి పార్థసారధి, ఐపీఎస్ అధికారి కె.ఆర్.ఎం. కిషోర్‌కుమార్‌తో పాటు ప్రముఖులు హాజరవుతారని ఖైరతాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షుడు కడారి శ్రీధర్, ఉపాధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామి, ఉపాధ్యక్షులు పున్న బాలకృష్ణ, శ్రీనివాసులు తెలిపారు.
సాయంత్రం పూజలకు సీఎం కేసీఆర్..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కైలాస విశ్వరూప మహాగణపతిని శుక్రవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.
భారీ గాయత్రీ మాల
రామన్నపేట: ఖైరతాబాద్‌లో ప్రతిష్ఠించే భారీ వినాయక విగ్రహానికి అలంకరించడానికి భారీ గాయత్రీ మాల (యజ్ఞోపవీతం) సిద్ధమైంది. ఖైరతాబాద్ పద్మశాలీ సంఘ పర్యవేక్షణలో సిరిపురం గ్రామానికి చెందిన పద్మశాలి పురోహితుడు అప్పం రాములు గాయత్రీ మాలను తయారు చేశాడు. దీని పొడవు సుమారు 25 మీటర్లు. గురువారం సిరిపురంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. చేనేత సహకార సంఘ అధ్యక్షుడు అప్పం రామేశ్వరం, ఎంపీటీసీ సభ్యుడు పున్న వెంకటేశం, పద్మశాలీ సంఘ అధ్యక్షుడు పెంటయ్యల ద్వారా ఖైరతాబాద్ పద్మశాలీ సంక్షేమ సంఘం వారికి దీన్ని అందజేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, సిటీ బ్యూరో: ఖైరతాబాద్ భారీ గణేషుడి వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ జితేందర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఈ రహదారి గుండా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా...
మింట్ కాంపౌండ్, నెక్లెస్ రోటరీ నుంచి వాహనాలను ఖైరతాబాద్ గణేష్ మండపం (ఖైరతాబాద్ లైబ్రరీ) వైపు అనుమతించరు. ఈ వాహనాలు ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
రాజీవ్‌గాంధీ విగ్రహం వైపు నుంచి వచ్చే వాహనాలను ఖైరతాబాద్ లైబ్రరీ వైపు అనుమతించరు. వాహనాలు రాజీవ్‌గాంధీ విగ్రహం నుంచి నిరంకారి వైపు మళ్లిస్తారు.
రాజ్‌దూత్ హోటల్ లేన్, ఖైరతాబాద్ మార్కెట్ బైలేన్ నుంచి వచ్చే వాహనాలు జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం నుంచి వెళ్లాల్సి ఉంటుంది.