
ముక్కోటి దండాలు
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ఓంకారనాదంతో మార్మోగారుు.. ...
కనులపండువగా మహాశివరాత్రి వేడుకలు వైభవంగా శివపార్వతుల కల్యాణం శివుడి సేవలో ప్రముఖులు
మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు ఓంకారనాదంతో మార్మోగారుు.. మంగళవారం వేకువజాము నుంచే భక్తులు బారులుతీరారు.. శివపార్వతుల కల్యాణోత్సవం కనులపండువగా సాగింది.. పొరుగు జిల్లాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి అశేష భక్తులు తరలివచ్చారు.. జాగరణ సందర్భంగా ఆలయ ప్రాంగణాల్లో భజనలు, కీర్తనలు జరిపారు.. వర్ధన్నపేట మండలంలోని ఐనవోలు మల్లన్న ఆలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
చారిత్రక శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్థంభాల దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మహావైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం శివరాత్రిని పురస్కరించుకుని స్వామి వారికి ఉదయం 2 గంటల నుంచే ప్రత్యేకార్చనలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ వేదపండితులు, అర్చకులు సుప్రభాతసేవ, మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకాలను నిర్వహించారు.
ఘనంగాశ్రీరుద్రేశ్వరస్వామి, శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యాణం
సాయంత్రం 6.32 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్రమున గోధానాళి లగ్న సుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి శ్రీరుద్రేశ్వరీ అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్ సతీసమేతంగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాల ను సమర్పించగా స్పీకర్ సిరికొండ మధుసూదనచారి స్వామివారికి ముత్యాల తలంబ్రాలను అందజేశారు. కలెక్టర్ కరుణ పాల్గొని రుద్రాభిషేకం నిర్వహించారు. పూజల్లో మాజీ ఎంసీ సిరిసిల్ల రాజయ్య, టీడీపీ నాయకుడు చాడా సురేష్‌రెడ్డి, జిల్లా జడ్జి వెంకటరమణ, జాయింట్ కలెక్టర్ ప్రశాంతి జీవన్ పాటిల్, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వేముల శ్రీనివాస్, వేముల సత్యమూర్తి, రచయిత పొట్లపల్లి శ్రీనివాసరావు, ఐనవోలు సత్యమోహన్, బండా ప్రకాష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.కల్యాణం అనంతరం ఇండియన్ ఓవర్సీస్ సౌజన్యంతో టీటీడీ ఆధ్వర్యం లో సాంస్కృతిక కార్యక్రమాలు తెల్లవార్లు కొనసాగాయి. కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ టి సాయిబాబా, పర్యవేక్షకులు అనిల్‌కుమార్, శ్రీరుద్రేశ్వర సేవా సమితి సభ్యులు చొల్లేటి కృష్ణమచారి, గండ్రాతి రాజు, పులి రజనీకాంత్, గౌరిశెట్టి శంకర్‌నారాయణ పాల్గొన్నారు.
అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో వారణాసి జ్యోతిర్లింగ కాశీ క్షేత్రం నుంచి తెప్పించిన లక్షా పదకొండు వేల పంచముఖ రుద్రాక్షలతో లక్ష రుద్ర మహాభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో బజ్జూరి శ్యాంసుందర్, వాగ్దేవి కళాశాలల కరస్పాండెంట్ చందుపట్ల దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. హన్మకొండ డీఎస్పీ పుల్లా శోభన్‌కుమార్, సీఐ కిరణ్ కుమార్ నేతృత్వంలో పోలిసులు బందోబస్తు నిర్వహించారు. దేవాలయ కార్యనిర్వహణాధికారి వద్దిరాజు రాజేందర్ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రాత్రి 8 గంటల వరకు పది లక్షల మంది భక్తులు శ్రీరుద్రేశ్వరున్ని దర్శించుకున్నట్లు అంచనా.