కొత్త అంశాలు తెరపైకి..
► ముస్కు మహేందర్‌రెడ్డి, పయ్యావుల కేశవ్‌పై గతంలోనే చీటింగ్ కేసులు
► కాంతం స్వప్న ఎవరో నాకు తెలియదన్న ఏఎస్సై మోహన్‌రెడ్డి
► ఆధారాలపై ఇంటెలిజెన్స్ ఆరా!
కరీంనగర్ క్రైం : ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. నాలుగు నెలల అనంతరం మోహన్‌రెడ్డి గురువారం మీడియా ముందుకు రావడం... ఇన్నాళ్లూ బాధితులుగా పేర్కొంటున్నవారు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారని పోలీసులు దృష్టి సారించాలని మోహన్‌రెడ్డి పలు ఆధారాలు చూపడం సంచలనం సృష్టించింది. తనపై నమోదైన పలు కేసుల్లో బాధితులు, ఫిర్యాదు చేసినవారు ఎవరో కూడా తనకు తెలియదని ఆయన పేర్కొనడం గమనార్హం. అన్ని విషయాలపై ఇంటెలిజెన్స్, స్పెషల్‌బ్రాంచ్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
► మోహన్‌రెడ్డి వెల్లడించిన అంశాల్లో బాధితుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా చెప్పుకుంటున్న ముస్కు మహేందర్‌రెడ్డి తన కుటుంబానికి చెందిన భూమికి నాటి మార్కెట్ ధర కన్నా ఎక్కువగా రూ.43 లక్షలు అప్పుగా తీసుకుని రెండేళ్లపాటు చెల్లించకపోతే వారి కుటుంబసభ్యులు వచ్చి భూమిని అమ్మిపెట్టమని అడిగారని, అప్పటి మార్కెట్ ధర చెల్లించి తన తండ్రి ఆదిరెడ్డి కొనుగోలు చేశారని తెలిపారు. మహేందర్‌రెడ్డి మాత్రం తాను రూ.5 లక్షలు మాత్రమే అప్పు తీసుకున్నానని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడని మోహన్‌రెడ్డి ఆరోపించారు. దీంతోపాటు మహేందర్‌రెడ్డిపై హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టు 27న ఫోర్జరీ కేసు, క్రైం నంబర్ 212/2015 నమోదైందని తెలిపారు. అక్రమంగా భూమిని దున్నినందుకు కోహెడ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
► కరీంనగర్‌వాసి పయ్యాల పెద్దిరెడ్డి ఇంతకు ముందు చైతన్యపురికాలనీకి చెందిన భీమనాథుని అనురాధ అనే మహిళకు మొదట భూమి విక్రయించాడని, తర్వాత ధర పెరగగానే తప్పుడు పత్రాలు సృష్టించి ఇబ్బందులు పెడుతున్నాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో 2012 ఆగస్టు 21న కరీంనగర్ టూటౌన్‌లో కేసు నమోదైందని, లోక్‌సత్తా నాయకుడినని చెప్పుకుంటూ తన నుంచి డబ్బులు వసూలు చేయడానికే ఈ ధర్నాలు చేస్తున్నాడని మోహన్‌రెడ్డి ఆరోపించడం చర్చనీయాంశమైంది.
► బోగ లక్ష్మి సైతం తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని, మొదట భూమి వేరేవారికి విక్రయంచి, రెండు నెలలు గడవకుండానే తన తండ్రికి విక్రయించిందని, దీంతో మొదట కొన్న వ్యక్తి ఆమెతోపాటు తన తండ్రిపైనా కేసు వేశాడని, జగిత్యాలలో ఇంకా నడుస్తోందని మోహన్‌రెడ్డి ఆధారాలు చూపించారు. లక్ష్మి గతంలో సీఎం, డీజీపీ, సీఐడీ అధికారులకు సైతం ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారించి నిబంధనల ప్రకారమే కొనుగోలు చేశారని క్లీన్‌చిట్ ఇచ్చినట్లు అతడు వెల్లడించగా, నిజానిజాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
► తనపై ఫిర్యాదు చేసిన కాంత స్వప్న ఎవరో కూడా తనకు తెలియదని, ఆమె 2015 ఆగస్టు 31న పలువురిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిందని, తాను అరెస్టు కాగానే అందులోంచి ఒకరిని తన బినామీగా పేర్కొంటూ మళ్లీ కొత్తగా ఫిర్యాదు చేసిందని, ఆమె ఎవరో కూడా తనకు తెలియదని మోహన్‌రెడ్డి పలుమార్లు పేర్కొనడంతో పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారని సమాచారం.
ఎస్‌బీ ఆరా!
తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మోహన్‌రెడ్డి మీడియా ముఖంగా పేర్కొనడంతో ఈ ఉదంతంపై ఎస్‌బీ, ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. మీడియా సమావేశంలో ఆయన పలు డాక్యుమెంట్లతో ఆధారాలు చూపించగా, వాటిపైనా విచారణ చేస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. మొత్తానికి బాధితులుగా చెప్పుకుంటున్న పలువురిపై మీడియా ముఖంగా మోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించగా, విచారణలో ఏం వెలుగుచూస్తుందోనని ఉత్కంఠగా మారింది.
స్వాగతించిన లోక్‌సత్తా
కరీంనగర్ క్రైం : న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఏఎస్సై మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనను లోక్‌సత్తా ఉద్యమ సంస్థ స్వాగతించింది. నిజానిజాలు తేల్చేందుకు రెండు మూడు తేదీలను తెలియజేస్తే బాధితులను కూడా సమావేశ పరుస్తామని లోక్‌సత్తా బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.