నల్లగొండ
ఎంఆర్‌ఆర్ (మెయింటెన్స్ ఆఫ్ రూరల్ రోడ్స్) గ్రాంట్ కింద మంజూరు కావాల్సిన నిధులకు రాజకీయ గ్రహణం పట్టింది. నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వానికి కొత్తగా రాజకీయ చిక్కులు కూడా తోడయ్యాయి. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్ శ్రేణులను సంతృప్తి పర్చేందుకు కోట్ల రూపాయల పనులు నామినేషన్ మీద కట్టబెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే...జిల్లావ్యాప్తంగా 59 మండలాల్లో 2,399 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు మరమ్మతు చేసేందుకు 1562 పనులకు ఏప్రిల్‌లో మంజూరిచ్చారు. ఈ నిధులతో రహదారులు లేని ప్రాంతాల్లో మట్టిరోడ్ల నిర్మాణం, కంకర రోడ్ల మీద మట్టిపోయడం వంటి పనులు చేయాల్సి ఉంది. కానీ ఈ పనులకు సంబంధించి ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు కదల్లేదు.
వేసవి కాలంలోనే పనులు ప్రారంభించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కడా కూడా చేపట్టలేదు. ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పనులు ఆమోదించి నిధులు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు నయాపైసా విడుదల చేయలేదు. అదీగాక ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు నామినేషన్ మీద పనులు చేయాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల తీర్మానాలు తప్పనిసరి చేశారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లే ఎక్కువ మంది ఉన్నందున తీర్మానాలు ఇచ్చేందుకు వారినుంచి అభ్యంతరాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యత్యాసం లేకుండా నిధుల పంపకాలు చేశారు. కానీ పనులు ప్రతిపాదనలు పంపడంలో మండల ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా చే యడంతో వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
పనులు రద్దుకు మొగ్గుచూపు..!
జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.49 కోట్లు మంజూరు చేశారు. అయితే దీంట్లో కోదాడ, మిర్యాలగూడ నియోజకవర్గాలకు నిధుల పంపకాల్లో రూ.2 కోట్లు కోత పెట్టారు. ఈ మేరకు కోత పెట్టిన నిధులను జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత నియోజకవర్గానికి రూ.6 కోట్లు, మాజీ పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గానికి రూ.5 కోట్లు అదనంగా ఇచ్చారు. మిగిలిన నియోజక వర్గాలకు ఒక్కోదానికి రూ.4 కోట్లు చొప్పున మంజూరు చేశారు.
నిధుల మంజూరీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత తలెత్తిన ‘తీర్మానం’ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక ప్రజా ప్రతినిధులు ఇరకాటంలో పడినట్లు సమాచారం. ఈ సమస్య అపరిష్కృతంగా ఉండగానే ప్రభుత్వానికి నిధుల జాడ్యం పట్టుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలంగా ఆర్థికశాఖ అన్ని రకాల చెల్లింపులు నిలిపేసింది. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించిన బిల్లులకే ఇప్పటి వరకు నయాపైసా విడుదల కాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంఆర్‌ఆర్ గ్రాంట్‌కు నిధులు వస్తాయన్న నమ్మకం అధికార వర్గాల్లో లేకుండా పోయింది. ఇప్పుడున్న తాజా ఆర్థిక ఇబ్బందులను బట్టి చూస్తే మంజూరు చేసిన పనులను ప్రభుత్వం రద్ధు చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు.
ఎలాంటి ఇబ్బందీ లేదు
- ఉమామహేశ్వర్‌రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ
ఎంఆర్‌ఆర్ పనులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. జిల్లా మంత్రి ఆమోదం పొందేందుకు ఫైల్ పంపాం. వర్షాలకు పనులు ప్రారంభిస్తే బయటి వైపు నుంచి విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో మొదలు పెట్టలేదు. మంత్రి ఆమోదం పొందగానే పనులు ప్రా రంభించేందుకు చర్యలు చేపడతాం.
మంజూరిచ్చారు... చేతులెత్తేశారు!
Published Thu, Jul 23 2015 11:05 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM
Advertisement
Advertisement