రెపరెపలు అక్కడివరకేనా..?
పాతబస్తీ దాటని ‘పతంగి’ ప్రచారం
మిగతా స్థానాల్లో కనిపించని హోరు
సీటు దక్కని సిట్టింగ్‌లు ప్రచారానికి నై
సాక్షి,సిటీబ్యూరో: మజ్లిస్ కంచుకోట పాతబస్తీలోనే ఆ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుండగా..మిగతా నియోజకవర్గాల్లో వెనుకబడిపోతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎన్నికల్లో గ్రేటర్‌లోని మూడు లోక్‌సభ, 18 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది.
ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చిన పార్టీ ప్రచారపర్వంలో మాత్రం పాతబస్తీ నియోజకవర్గాలు మినహా మిగతా స్థానాల్లో పూర్తిగా వెనుకబడినట్లు కనిపిస్తోంది.ఏకంగా కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంకు ఎన్నికలు పూర్తయ్యే వరకు విరామం ప్రకటించి మొఘల్‌పురాలోని ఒక ఫంక్షన్‌హాల్‌ను ఎన్నికల కార్యాలయంగా మార్చుకుంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానాలపైనే అధికదృష్టి సారించడంతో సిట్టింగేతర కొత్త స్థానాల్లో ప్రచారహోరు ఇంకా ఊపందుకోలేదు.
పాతబస్తీకే పరిమితం
మజ్లిస్ పార్టీ అగ్రనేతల పర్యటనలు పాతబస్తీకే పరిమితమవుతున్నాయి. పార్టీ అధినేత అసదుద్దీన్‌ఒవైసీ, చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేస్తున్న అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రచారంలో తీరిక లేకుండా సాగుతున్నారు. సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. సిట్టింగ్ నియోజకవర్గాలు చార్మినార్, మలక్‌పేట, యాకుత్‌పురా, బహుదూర్‌పురాల్లో కూడా అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.
గల్లీగల్లీకి తిరుగుతూ పతంగి గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాంపల్లి, కార్వాన్ స్థానాల్లో సిట్టింగ్‌లను పక్కనబెట్టి కొత్తవారిని బరిలోకి దింపడంతో అక్కడి ఎమ్మెల్యేలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ ప్రచారం ఊపందుకుకోలేదు.
కొత్త స్థానాల్లో ఊసేలేని ప్రచారం
మజ్లిస్ కొత్తగా బరిలో దిగిన నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారహోరు ఇంకా పుంజుకోలేదు. అడపాదడప పార్టీ అధినేత అసదుద్దీన్‌ఒవైసీ తన లోక్‌సభ పరిధి దాటి ఇతర అసెంబ్లీ సెగ్మెంట్లల్లో ప్రచారం చేస్తుండగా.. మిగతా నేతలు మాత్రం పెద్దగా తిరగట్లేదు. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం ఫర్వాలేదనిపిస్తున్నా..మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం పత్తా లేకుండా పోయింది. దీంతో ఈసారి గ్రేటర్‌వ్యాప్తంగా మజ్లిస్ పార్టీ బరిలో దిగినప్పటికీ పతంగి ప్రచారం పాతబస్తీ మినహా మిగతా నియోజకవర్గాల్లో అంతంతమాత్రమే అని చెప్పొచ్చు.