వ్యవసాయరంగానికి పెను సవాళ్లు
- కేంద్ర వ్యవసాయ కమిషనర్ జె.ఎస్.సంధూ వ్యాఖ్య
- వరి పరిశోధన కేంద్రంలో జాతీయ సదస్సు ప్రారంభం
- క్షీణిస్తున్న భూసారం, నీటి లభ్యత పెరుగుతున్న చీడపీడలు
- బయోటెక్నాలజీ, జన్యుశాస్త్రాలే దిక్కు అని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తరచూ వచ్చే కరువు, వరద లు, పెరిగిపోతున్న చీడపీడల బెడద వ్యవసాయరంగానికి సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు, వీటినుంచి తట్టుకుని మంచి దిగుబడులను ఇవ్వగల వంగడాలను అభివృద్ధి చేయాల్సి న అవసరం ఎంతైనా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ కమిషనర్ జె.ఎస్.సంధూ పిలుపునిచ్చారు.
ఆధునిక సాంకేతిక పద్ధతుల సాయంతో జీవ సంబంధ, వాతావరణ సంబంధ వ్యవసాయరంగ సమస్యలను అధిగమించడం సాధ్యమేనని ఆయన శనివారం హైదరాబాద్‌లోని వరి పరిశోధన కేంద్రంలో మాట్లాడుతూ అన్నారు. ‘ఎమర్జింగ్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చూనిటీస్ ఇన్ బ యాటిక్ అండ్ అబయాటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ అన్న అంశంపై వరి పరిశోధన కేంద్రంలో ప్రా రంభమైన రెండు రోజుల జాతీయ సదస్సుకు జె.ఎస్.సంధూ ముఖ్యఅతిథిగా హాజయ్యారు.
1965 ప్రాంతంలో వరి పంటను ఐదు రకాల చీడలు మాత్రమే ఆశించేవని.. ప్రస్తుతం వీటి సంఖ్య 15కు పెరిగిపోయిందని ఆయన వివరించారు. బీటీ ద్వారా బోల్‌గార్డ్ బెడదను తొల గించుకున్నా ఇతర సమస్యలు ఎక్కువయ్యాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో వాతావరణ అనిశ్చితి కూడా పెరిగిపోతోందని, నెలరోజుల క్రితం అసోంలో పంటలు వరదలతో నీట మునిగి ఉంటే ప్రస్తుతం నీరు అందని పరిస్థితి ఉందని తెలిపారు.
అనేక పంటల జన్యుక్రమాల నమోదు పూర్తికావడం, బయోటెక్నాలజీ రంగం వృద్ధి చెందడం భవిష్యత్ సవాళ్లను అధిగమించగలమన్న ధీమాను కల్పిస్తున్నాయని చెప్పారు. ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎ.పద్మరాజు, ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ (రాయ్‌పూర్) ఉపకులపతి డాక్టర్ ఎస్.కె.పాటిల్ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యల పరి ష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.
పెరిగిపోతున్న అవసరాలు, వాతావరణ మార్పులు, నీటికొరత, తగ్గిపోతున్న భూకమతాల విస్తీర్ణం వ్యవసాయ రంగంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతున్నాయని, ప్రకృతి వనరుల సమర్థ వినియోగం, అధికదిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టితో వీటిని అధిగమించాలని సూచించారు. భూసార పరిరక్షణతోపాటు శాస్త్రవేత్తల పరిశోధన ఫలాలను రైతులకు వేగంగా అందజేసేందుకు తగిన వ్యవస్థలను రూపొం దించాల్సిన అవసరం ఉందన్నారు.
వరి పరిశోధ న కేంద్రం డెరైక్టర్ వి.రవీంద్రబాబు మాట్లాడుతూ దిగుబడులతోపాటు పోషకవిలువలు ఉన్న వరివంగడాలను అభివృద్ధి చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ఆస్తా ఫౌండేషన్, సొసైటీ ఫర్ సైంటిఫిక్ డెవలప్‌మెంట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (మీరట్, ఉత్తరప్రదేశ్), సొసైటీ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (హైదరాబాద్)లు ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు దేశం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విద్యార్థులు హాజరయ్యారు.