‘అగ్రి’కి యమా క్రేజ్..!
♦ మెడిసిన్ లేకున్నా అగ్రికల్చర్ ఎంసెట్‌కు అధిక డిమాండ్
♦ అగ్రికల్చర్ కోర్సుల కోసం భారీగా వచ్చిన దరఖాస్తులు
♦ ఇప్పటికే దరఖాస్తు చేసిన 65 వేల మంది విద్యార్థులు
♦ ఇంజనీరింగ్ కోసం 1.19 లక్షలకుపైగా దరఖాస్తులు
♦ మొత్తంగా ఇప్పటివరకు 1.87 లక్షల దరఖాస్తులు
♦ ఈనెల 15తో ముగియనున్న దరఖాస్తుల గడువు
సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్, దాని పరిధి లోని పలు కోర్సులకు ఈసారి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎంసెట్ పరిధిలో నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులతోపాటు ఆయు ర్వేద, హోమియోపతి, నేచురోపతి, యోగా వంటి ఆయుష్ కోర్సులు నీట్ పరిధిలోకి వెళ్లినా అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి ఎంసెట్ రాసేందుకు ఇప్పటికే 65 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు.
అగ్రికల్చర్ ఎంసెట్ పరిధిలోని బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, బీఫార్మా, బయోటెక్నాలజీ, ఫార్మా–డి కోర్సు ల్లో చేరేందుకు నిర్వహించే అగ్రి ఎంసెట్ రాసేందుకే వీరంతా దరఖాస్తు చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఎంసెట్ కోసం ఫీజు చెల్లించే గడువు ఈనెల 15 వరకు ఉంది. అప్పటి వరకు దరఖాస్తుల సంఖ్య 75 వేలు దాటుతుందని అధికారుల అంచనా.
గత ఏడాది కంటే ఎక్కువ...
గత ఏడాది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తోపాటు అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సు ల్లో చేరేందుకు 1.02 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకే 56 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయుష్ కోర్సుల కోసం మరో 10 వేల మంది వరకు దరఖాస్తు చేసు కున్నారు. అంటే అగ్రికల్చర్ దాని పరిధిలోని కోర్సుల్లో చేరడానికి దరఖాస్తు చేసిన వారు 35 వేల మందే. ఈ ఏడాది ఇప్పటికే 65,459 దరఖాస్తులు రాగా ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉన్నందున మరో 10 వేల దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు.
మరో వైపు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు అగ్రికల్చర్, దాని పరిధి లోని కోర్సులపై దృష్టి సారించినట్లు «అధికారు లు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినందున విద్యార్థులు ఆయా కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతు న్నారు. మరోవైపు నీట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు కూడా ప్రాక్టీస్ కోసం ఎంసెట్‌కు కూడా దరఖాస్తు చేసి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంజనీరింగ్ దరఖాస్తులు 1.19 లక్షలు
ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటి వరకు 1,19,720 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య గతేడాదిలాగే 1.40 లక్షలు దాటుతుందని అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది ఇంజనీరింగ్ ఎంసెట్ రాసేందుకు 1,44,511 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,33,428 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. అందులో 1,03,923 విద్యార్థులు అర్హత సాధించారు. మరోవైపు అగ్రికల్చర్, ఇంజనీరింగ్ రెండింటికి హాజరయ్యేందుకు మరో 1,195 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ దరఖాస్తులు 18,973
తెలంగాణ ఎంసెట్ రాసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 18,973 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కోసం 10,093 మంది.. అగ్రికల్చర్ ఎంసెట్ కోసం 8,750 మంది, రెండూ రాసేందుకు 65 మంది దరఖాస్తు చేశారు.